కంటోన్మెంట్​ను మాకు అప్పగించండి

కంటోన్మెంట్​ను మాకు అప్పగించండి
Telangana Planning Commission Vice President Vinod Kumar

కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ శనివారం లేఖ రాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ బోర్డు విలీనం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్‌ ఉన్నాయని, కంటోన్మెంట్ మాకు అప్పగిస్తే జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ట్రాఫిక్‌తో పాటు జనాభా పెరుగుతున్న కారణంగా అనేక రహదారులను ఏర్పాటు చేసి, కొత్త కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్ రోడ్డు విస్తరణ పనులకు రక్షణ శాఖ స్థలం ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కోరారు.

నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్లతో పాటు డ్రైనేజీ సిస్టం మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, బోయినపల్లి నుంచి కొంపల్లి తరహాలో పారడైస్ నుంచి శామీర్‌పేట్‌ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలు ఇస్తే ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటామని గతంలోనే కోరామని, ఈ కారిడార్ నిర్మిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు.