మారిన సీన్ అనుకున్నదొక్కటి.. అయినది ఇంకొక్కటి

మారిన సీన్ అనుకున్నదొక్కటి.. అయినది ఇంకొక్కటి
  • ఎన్నికల ఎజెండాగా టీఎస్​పీఎస్సీ లీక్
  • కీలక సమయంలో విపక్షాలకు అస్త్రం
  • నిరుద్యోగుల సపోర్ట్​ కోసం వ్యూహాలు
  • ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాలని ప్లాన్​
  • నిరసనలకు దిగుతున్న ప్రధాన పార్టీలు
  • గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు​
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సన్నాహాలు
  • ‘నిరుద్యోగ మిలియన్​మార్చ్’ దిశగా బీజేపీ ​
  • సంకటంలో పడిపోయిన కేసీఆర్​ సర్కారు

‘80 వేల ఉద్యోగాలు భర్తీ, రాష్ట్రంలో కొలువుల కుంభమేళా’ అంటూ నిరుద్యోగులు, యూత్​కు వల వేసిన కేసీఆర్​ సర్కారు ప్లాన్​ తిరగబడింది. యేండ్ల నుంచి పెండింగ్​లో పెట్టి, మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు విసిరిన ఉద్యోగాల గాలం తిరిగి సర్కారుకే చిక్కుకుంది. కీలకమైన ఎన్నికల యేడాదిలో టీఎస్​పీఎస్సీ వ్యవహారం విపక్షాలకు అస్త్రంగా మారింది. పెద్ద పార్టీల నుంచి మొదలుకుని, కిందిస్థాయి వరకు పేపర్​ లీకు వ్యవహారాన్ని అదునుగా తీసుకుంటున్నారు. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు దారి దొరికినట్టయ్యింది. ఇప్పుడు దీన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనేదే వారి ముందున్న అసలు సవాల్. 

మారిన సీన్
అనూహ్యంగా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలను ఇంటి దొంగలు లీకు చేశారు. అభ్యర్థులకు అమ్మారు. కొంత ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చినా ఈ అంశం రాష్ట్రాన్ని ఊపేస్తున్నది. లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఇంకా చాలా పరీక్షలపై అనుమానాలున్నాయి. ఆ పరీక్షలు రాసిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. సర్కారు తీరును ఎండగడుతూ రోడ్డెక్కుతున్నారు. ఇటు పరీక్షలు రాసి, అర్హత సాధించినవారు కూడా వ్యతిరేకమయ్యారు. కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్​ లీకుతో వాటన్నింటినీ రద్దు చేయడంపై మండిపడుతున్నారు. దీంతో సర్కారు వేసిన ఉద్యోగాల భర్తీ మాస్టర్​ ప్లాన్​ బెడిసికొట్టింది.


ముద్ర, తెలంగాణ బ్యూరో:
ఎనిదేండ్ల సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఈసారి ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం అనుకూలంగా తీసుకుంది. ఒకేసారి 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడితే, నిరుద్యోగులతో పాటుగా వారి కుటుంబ సభ్యుల ఓట్లన్నీ గంపగుత్తగా దక్కుతాయని భావించింది. దీంతో ఎన్నికలకు ముందు ఉద్యోగాల ప్రకటన, ఆర్థిక శాఖ నుంచి అనుమతి, నియామక సంస్థల నుంచి నోటిఫికేషన్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉద్యోగాల కుంభమేళా మొదలైందని ప్రభుత్వం తరుపున మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రచారం మొదలుపెట్టుకున్నారు. గ్రూప్–1 నుంచి మొదలుకుని గ్రూప్–4 వరకు, పోలీస్, రెవెన్యూ, విద్యా, వైద్యశాఖల నుంచి నోటిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఆశించినట్టుగానే దాదాపు 24 లక్షల మంది నిరుద్యోగులు పుస్తకాలలో నిమగ్నమయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిణామాలు అనుకూలంగా మారడంతో సర్కారు కూడా సంబురపడింది. 

ఇంటిదొంగల వ్యవహారం
అనూహ్యంగా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలను ఇంటి దొంగలు లీకు చేశారు. అభ్యర్థులకు అమ్మారు. కొంత ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చినా ఈ అంశం రాష్ట్రాన్ని ఊపేస్తున్నది. లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఇంకా చాలా పరీక్షలపై అనుమానాలున్నాయి. ఆ పరీక్షలు రాసిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. సర్కారు తీరును ఎండగడుతూ రోడ్డెక్కుతున్నారు. ఇటు పరీక్షలు రాసి, అర్హత సాధించినవారు కూడా వ్యతిరేకమయ్యారు. కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్​ లీకుతో వాటన్నింటినీ రద్దు చేయడంపై మండిపడుతున్నారు. దీంతో సర్కారు వేసిన ఉద్యోగాల భర్తీ మాస్టర్​ ప్లాన్​ బెడిసికొట్టింది. అనుకూలత వస్తుందని ఆశిస్తే, వ్యతిరేకతను పెంచుకున్నట్లుగా మారింది. 

ఆ రెండింటి మీదే రాష్ట్రంలో చర్చలు
రాష్ట్రంలో ప్రస్తుతం రెండే అంశాలు చర్చలలో ఉన్నాయి. ఒకటి టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకు, మరోకటి ఢిల్లీ లిక్కర్​ స్కామ్ లో కవిత విచారణ. కవిత విచారణను బీజేపీ మినహా ఇతర పార్టీలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకు అంశాన్ని మాత్రం అందిపుచ్చుకుంటున్నాయి. పార్టీలు క్షేత్రస్థాయి నుంచి నిరసనలకు దిగుతున్నాయి. ప్రజా సంఘాలు కూడా మద్దతుగా వస్తున్నాయి. అటు విద్యార్థి సంఘాలు సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రోడ్డెక్కుతున్నాయి. పేపర్​ లీకు అంశంపై ఇప్పటికే కాంగ్రెస్​ దీక్షలకు దిగింది. అటు బీజేపీ, బీఎస్పీ కూడా దీక్షలు చేశాయి. ఇప్పటి వరకు సైలెంట్​గా ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు నిరుద్యోగుల అంశంపై యాక్టివ్​ అయ్యాయి. రౌంట్​ టేబుల్​ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీంతో కీలక సమయంలో విపక్షాలకు ప్రభుత్వంపై దీటైన అస్త్రం దొరికినట్లుగా మారింది. 

ఎన్నికల వరకు ఇంతే 
ఈ పరిణామాలను అంత ఈజీగా వదిలేయవద్దంటూ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు నిరుద్యోగుల మద్దతు కోసం ప్రయత్నాలు చేసిన పార్టీలు ఇప్పుడు ‘నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్’​ అనే నినాదం ఎత్తుకున్నాయి. సీఎం కేసీఆర్ నిరుడు​ప్రకటించిన నాటి నుంచి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదంటూ లెక్కలతో చెప్పడమే కాకుండా,  రాసిన పరీక్షలు రద్దు కావడం, పేపర్​ లీకేజీలో రోజుకో అంశం వెలుగులోకి వస్తుండటంతో దీన్ని ఎన్నికల ఎజెండాగా మల్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ పార్టీ దీనిపై బుధవారం గవర్నర్​ను కలిసింది. మంత్రి కేటీఆర్​ను, ఆయన పీఏ పేరును ప్రస్తావిస్తూ కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెంచాలని ప్లాన్​ వేస్తున్నది. బీజేపీ కూడా ఇదే అంశంపై ఫోకస్​ పెట్టింది. ఇప్పటికే బండి సంజయ్​ దీక్ష చేశారు. తాజాగా నిరుద్యోగ మిలియన్​ మార్చ్​ అంటూ కొత్త నిరసనను ప్రకటించారు. 25న భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. మాజీ ఐపీఎస్​ అధికారి ప్రవీణ్ కుమార్​ కూడా ఇదే రాగాన్ని అందుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, పేపర్ల లీకు అంశంపై విమర్శలు పెంచారు. టీఎస్​పీఎస్సీ పాలకవర్గాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. పేపర్ల లీకుపై అటు నిరుద్యోగులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారి ఆగ్రహాన్ని మరింత పెంచుతూ విపక్షాలు కూడా గొంతు కలుపుతున్నాయి. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, వారి కుటుంబాలను ప్రభుత్వానికి దూరం చేస్తే తమకు కలిసి వస్తుందనే వ్యూహం వేస్తున్నారు. 

ముఖ్యమంత్రి సమీక్ష చేసినా
ఉద్యోగాల వ్యూహం బెడిసికొట్టడంతో సర్కారు సంకటంలో పడింది. దీనిపై సీఎం కేసీఆర్​ సమీక్ష చేసినా, ఆయన నోరు విప్పలేదు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కానీ, మీడియా ముందే ఆయన ఫ్రస్టేషన్ కు గురయ్యారు.​నిరుద్యోగులను కొంతైనా అనుకూలంగా మల్చుకునేందుకు ఉచితంగా భోజనం, స్టడీ సర్కిళ్లలో పాఠాలు అంటూ చెప్పినా వ్యతిరేకత తగ్గించడం లేదు. ఇదే సమయంలో మంత్రులు కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాలలో నిలదీతలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కూడా నోరు జారారు. పేపర్​ లీకేజీ అనేది సర్వసాధారణమంటూ చెప్పడంతో నిరుద్యోగులు మరింత రెచ్చిపోతున్నారు. పేపర్​ లీకేజీని వ్యవస్థకు కాకుండా, ఇద్దరు నిందితులకు మాత్రమే అంటగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాలు మాత్రం ప్రభుత్వానికే సంబంధం ఉందంటూ విమర్శలకు దిగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కష్టకాలం ఎదురవుతున్నది.