ఉంటుందా..? లేదా?

ఉంటుందా..? లేదా?
  • నేడు జరిగే కేబినెట్ భేటీపై అనుమానాలు
  • సీఎం కేసీఆర్ అస్వస్థతో మీటింగ్ వాయిదా పడే అవకాశం
  • మంత్రులకు ఇంకా రాని సమాచారం
  • ఎన్నికలకు ముందు కీలక భేటీగా మారిన సమావేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​అధ్యక్షతన నేడు జరగాల్సిన రాష్ట్ర కేబినెట్​భేటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు అత్యంత కీలక భేటీగా మారిన ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్​అస్వస్థకు గురికావడంతో మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం సీఎంకు యశోద ఆస్పత్రికి చెందిన వైద్యులు ప్రగతి భవన్ లోనే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రగతి భవన్ సమాచారం మేరకు కేసీఆర్  తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై నిలీనడలు కమ్ముకున్నాయి. దీనిపై ఇప్పటి వరకు మంత్రులకు కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. కేవలం వారిని అందుబాటులో ఉండాలని మాత్రమే సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.   

రెండు రోజులు వాయిదా?

ఒక వేళ సీఎం కేసీఆర్ ఆనారోగ్యం కారణంగా ఒకటి, రెండు రోజులకు వాయిదా వేసే అవకాశం  కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయినట్లుగా సమాచారం. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ వైద్యలు సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం నాటికి ఆయన ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అలా కానీ పక్షంలో ఒకటి, రెండు రోజులకు వాయిదా వేసి తదనంతరం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని కూడా సమాచారం. 

ఇదే చివరి మంత్రివర్గ సమావేశం..

ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రి వర్గ సమావేశం కావడంతో.. ముఖ్యమైన అంశాలకు ఆమోదముద్ర వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల వేతన సవరణ సహా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వేతన సవరణ కోసం కమిషన్‌ను నియమించడంతోపాటు మధ్యంతర భృతి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే  అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త పథకాలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. తాజాగా గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని భావించింది. అయితే కేసీఆర్ అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న అంశంపై  ప్రస్తుతానికి రెండు, మూడు రోజుల పాటు వేచి చూడాల్సిందేనని ప్రగతి భవన్ వర్గాల్లో వినిపిస్తోంది.