‘డబుల్’​రగడ!

‘డబుల్’​రగడ!
  • మొన్న బీజేపీ.. నిన్న కాంగ్రెస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో డబుల్​బెడ్​రూం ఇళ్ల అంశం కాంగ్రెస్, బీజేపీలకు ప్రచారాస్త్రంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు కలిసొచ్చే ఏ అంశాన్నీ వదిలిపెట్టడం లేదు. బీఆర్ఎస్​ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉన్న అంశాలపై దృష్టిసారించిన ఆయా పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే పోడు భూముల పట్టాలు, నిరుద్యోగం, ధరణి సమస్యలు, లిక్కర్​స్కాం లపై ఆందోళన చేపట్టిన ఆయా పార్టీలు తాజాగా నిరుపేదలకు డబుల్​బెడ్​రూం ఇళ్ల అంశాన్నీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ నెల 20న బాటసింగారంలో అసంపూర్తిగా ఉన్న డబుల్​బెడ్​రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, కొండా విశ్వేశ్వర్​రెడ్డిని శంషాబాద్​లో అడ్డుకున్న పోలీసులు.. ఎన్నికల కమిటీ చైర్మన్​ఈటల రాజేందర్ ఇతర సీనియర్​నాయకులను గృహనిర్భందం చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి బీఆర్ఎస్​పై యుద్ధం మొదలైందనీ.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామి గురించి ఇకపై ప్రశ్నిస్తామని హెచ్చరించారు. మరోవైపు తాజాగా సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల నాణ్యతను పరిశీలించడానికి వెళ్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి షేక్షావలి, ఆచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, వనపర్తి పట్టణ అధ్యక్షులు కారపాకుల వెంకట్రాములును పెబ్బేరు పోలీసులు ముందస్తు అరెస్ట్​చేయడాన్నీ కాంగ్రెస్​తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ శ్రేణులు డబుల్​బెడ్​రూం ఇళ్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది.