దంచుకొడుతోన్న వాన హైదరాబాద్ లో ఏకధాటిగా వర్షం

దంచుకొడుతోన్న వాన హైదరాబాద్ లో ఏకధాటిగా వర్షం
  • వికారాబాద్, పరిగి నుంచి మూసీలోకి భారీగా చేరుతున్న వరద నీరు
  • ముసీ పరివాహక లోతట్టు ప్రాంతాలు మునక
  • హిమయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాలు కారణంగా పలుచోట్ల నదులు పొంగుపొర్లుతున్నాయి. రోడ్లపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. నదులు , జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జనగామ, జిగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల రాజన్న, వికారాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి. నగరంలో పలుచోట్ల రోడ్లు, కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. హిమయత్ సాగర్, హుస్సేన్ సాగర్ రెండు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతంలో కురుస్తున్న వర్షపు నీరు మూసినదిలోకి వచ్చి చేరడంతో పొంగిపొర్లుతుంది. దీంతో మూసీపై ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జీని వరద నీరు తాకుతుంది. మూసీనది పరివాహక ప్రాంతంలో ఉన్న ముసారాంబాగ్, పురానాపూల్, జియాగూడ, శంకర్ నగర్ వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు. వరద మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతలకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలి :  టీఎస్ ఎస్పీడీసీఎల్
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద నిలబడొద్దని సూచించారు. పశువులు, పెంపుడు జంతువులను విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉంచాలన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు ఉన్నట్లయితే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 7382072106, 7382071574 ఫోన్ చేయాలని ఆయన కోరారు.

వర్క్ ఫ్రమ్ హోం చేసుకోండి :  పోలీసులు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు పోలీసులు పలు సూచనలు చేశారు. బయటకు రాకుండా సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని వారు సూచించారు.