షేక్ హ్యాండ్స్​ ఎట్టకేలకు నేతల ఐక్యతారాగం

షేక్ హ్యాండ్స్​ ఎట్టకేలకు నేతల ఐక్యతారాగం
  • చేతులు కలుపుతూ ముందుకు
  • జోష్  నింపిన కరీంనగర్​ కవాతు
  • సంబురపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు
  • ఠాక్రే సారథ్యంలో విభేదాలకు స్వస్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో:
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నాళ్లకు రాష్ట్ర కాంగ్రెస్‌ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. మాణిక్యం ఠాకూర్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి’ అన్నట్లుగా ఉన్న పరిస్థితి మాణిక్‌రావ్‌ థాక్రే బాధ్యతలు చేపట్టాక మారిపోయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులలో  కొత్త జోష్​కనిపిస్తోంది. ఎన్నికల వరకూ ఇలా అందరూ కలిసి ఉంటే తమదే అధికారం అంటూ చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత స్వరాష్ట్రంలో కాంగ్రెస్ క్రమంగా బలహీనపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన తరువాత క్యాడర్ లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. కానీ, పార్టీ సీనియర్ల వ్యవహారం మాత్రం ఆందోళన కల్గించింది. విమర్శలు, వ్యతిరేక నినాదాలు, విభేదాలు ఇలా నేతలు వేరయ్యారు. ఇన్నిరోజులు దూరంగా ఉన్న వారంతా వచ్చి ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్​ గడ్డపై గురువారం నిర్వహించిన కవాతు భారీ విజయం సాధించింది. 

కలిసి పని చేద్దాం
సుదీర్ఘ సమయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు గాడిలో పడ్డారు. వచ్చే ఎన్నికలలో  అధికారం ‘చే’జిక్కించుకోవడానికి వీలుగా విభేదాలను పక్కన పెడుతున్నారు. పార్టీ అధిష్టానం మందలింపుతో నాయకులందరు ఒక్కటిగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు, అసంతృప్తులు, విమర్శలు సహజం. టీపీపీసీ చీఫ్​గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత అవి మరింత పెరిగాయి. నేతలు సీనియర్లు, జూనియర్లుగా విడిపోయారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించినా దారికి రాలేదు. ఇదే సమయంలో ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో  వివాదాలు మరింత పెరిగాయి. రెండుగా చీలిపోయి ‘సేవ్​ కాంగ్రెస్’​ అంటూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో ఏఐసీసీ, సీడబ్ల్యూసీ వెంటనే జోక్యం చేసుకోవడం, డిగ్గీరాజా రావడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్​ ను మార్చడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాణిక్​ రావు ఠాక్రేను తీసుకురావడంతో పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు తాత్కాలికంగా సమిసిపోయినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఫలించిన ఠాక్రే మార్క్​
గతంలో ఉన్న పార్టీ బాధ్యుల కంటే భిన్నంగా ఠాక్రే వ్యవహరిస్తున్నారు. ‘ఏదో వచ్చామా? అధిష్టానం సూచించిన మాటలను రాష్ట్ర నేతలకు చెప్పామా.. వెళ్లిపోయామా?’ అన్నట్టుగా కాకుండా, ఠాక్రే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. సీనియర్లు ప్రాతినిధ్యం వహించే సెగ్మెంట్లతో పాటుగా జూనియర్లు కీలకంగా వ్యవహరిస్తున్న ప్రాంతాలలో కలియతిరుగుతున్నారు. ఇటీవల వరుసగా నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఠాక్రే పాదయాత్రలలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన అంశాలను పదేపదే నేతల ముందు పెడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలు, సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశాలలోనే మాట్లాడాలని, చర్చించి పరిష్క రించుకోవాలని, లేదంటే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సీనియర్లు కూడా అందరితో కలిసిరాక తప్పని పరిస్థితులను నెలకొల్పారు. దీంతో నాయకులందరూ ప్రస్తుతానికి మౌనంగానే ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ప్రొటోకాల్​ ప్రకారం రేవంత్​తో కలిసి వస్తున్నారు. ఫలితంగా పార్టీ నేతలలో కొత్త జోష్​ మొదలైంది. రాష్ట్ర నేతల  నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌ వైపు మళ్లడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సీనియర్లు కూడా కొంత వెనక్కి తగ్గారని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో తొమ్మది నెలల సమయం ఉన్నందున ప్రజలకు ఐక్యంగా ఉన్నా మనే సంకేతాలు ఇవ్వాలని, లేదంటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ముందుగా వెనుకడగు
రాహుల్‌చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాలలో  ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌’ పేరుతో పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ అదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రను మొదలు పెట్టారు. మొదట రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని, నాయకులందరు తమ తమ సొంత నియోజక వర్గాలలో యాత్రలు చేపట్టాలనే వాదనను కొంత మంది సీనియర్లు తెరపైకి తీసు కొచ్చారు. దీంతో పార్టీలో కొంత గందరగోళం కూడా నెలకొన్న ది. వెంటనే మాణిక్‌ రావు ఠాక్రే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. నాయకులందరూ ఎవరికి వారుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమమార్క, ఇతర సీనియర్లు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా యాత్రలలో పాల్గొంటారని షెడ్యూల్​ ఖరారు చేశారు.  దీంతో  రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా పాదయాత్రకు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు మాత్రమే వచ్చారు. తర్వాత నుంచి సీనియర్ల వైఖరి మారింది.  వారు కూడా హాజరై సంఘీభావం చెబుతూ వస్తున్నారు. గతంలో వ్యతిరేకంగా విమర్శలు చేసిన జిల్లాల నేతలు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహించారు. వీలును బట్టి అటు రేవంత్​పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లితే అధికారం రావడం ఖాయమంటూ పాదయాత్రలో అడుగులు వేస్తున్నారు. 

కవాతు హిట్​
కరీంనగర్ కవాతు కాంగ్రెస్ శ్రేణులలో కదలిక తెచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఒకే వేదికపై కనిపించడం శ్రేణులలో జోష్ నింపింది. ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజాందోళనలకు సన్నద్ధమవుతుంది. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నది. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టుకునేలా  ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కరీంనగర్ ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ , ఠాక్రే హాజరయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ ఇలా సీనియర్లంతా వేదికపై కనిపించే సరికి శ్రేణుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కరీంనగర్ ప్రాధాన్యతను కాంగ్రెస్ కవాతు స్పష్టం చేసింది.  దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేసింది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే బాధ్యత ప్రజలపై ఉందనే విషయాన్ని ఈ సభ ద్వారా గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షలు ఇస్తామని,  రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పేద రైతులకు రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ. ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించేలా నిబంధనలు సవరిస్తామని, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీలిచ్చారు.