హై అలర్ట్.. కవితను అరెస్ట్​ చేయవచ్చన్న కేసీఆర్​

హై అలర్ట్.. కవితను అరెస్ట్​ చేయవచ్చన్న కేసీఆర్​
  • బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు
  • భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు
  • వారు చివరకు నా బిడ్డ దాకా వచ్చారు 
  • మంత్రులు, ఎంపీలు ధైర్యంగా ఉండాలి
  • వేధింపుల బీజేపీని గద్దె దించి తీరుదాం
  • పార్టీ మీట్ లో  సీఎం కీలక వ్యాఖ్యలు
  • హుటాహుటినా ఢిల్లీకి మంత్రి కేటీఆర్​
  • ఆల్రెడీ హస్తినకు చేరిన కేసీఆర్ లీగల్​ టీం


ఢిల్లీ లిక్కర్​స్కామ్ పరిణామాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆ పార్టీ మొత్తం అలర్ట్​అయ్యింది. కవితను అరెస్ట్​ చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్​ స్వయంగా వెల్లడించారు. అరెస్టు చేసినా భయపడేది లేదని పార్టీ నేతలకు ధైర్యం నూరిపోశారు. ఇటు బీఆర్ఎస్​ నేతలు హస్తిన బాట పట్టారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ హుటాహుటినా ఢిల్లీ ఫ్లైటెక్కారు. అంతకు ముందే కేసీఆర్ కు న్యాయపరమైన సలహాలు ఇచ్చే బృందం, లీగల్​ కేసులను పర్యవేక్షిస్తున్న టీం మొత్తం ఢిల్లీలో మకాం పెట్టింది. ఓ ఎంపీ ఇంటి నుంచి నిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నది. లిక్కర్​ స్కాం పరిణామాలలో నిమిష నిమిషానికి ఏం జరుగుతుందనే వివరాలను సేకరిస్తున్నది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈడీ ఎదుట కవిత శనివారం హాజరుకానున్నారు. విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేసీఆర్ మొదటిసారి స్పందించారు. శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలకంగా చర్చించారు. ఎన్నికల గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన తర్వాత కవిత గురించి ప్రస్తావన వచ్చింది. కవితను అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ, అందర్నీ వేధిస్తున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎవరికీ భయపడేది లేదని, పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ లేకుండా చేద్దామని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని, దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రుల నుంచి ఇప్పుడు కవిత వరకు ఈ వేధింపులు వచ్చాయన్నారు. ‘ఏం చేస్తారో.. చేసుకోనివ్వండి. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు’ అని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ పార్టీ ఓర్వలేకపోతున్నదని, అనేక కుట్రలకు పాల్పడుతున్నారని, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను దర్యాప్తు సంస్థలతో వేధించారని, ఇప్పుడు తన బిడ్డ దాకా వచ్చారన్నారు. ఈ వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతామని, ఎదుర్కొంటామని పార్టీ వర్గాలకు ధైర్యం చెప్పారు. 

హస్తినకు లీగల్​ టీం.. సాయంత్ర కేటీఆర్​
శనివారం ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా లీగల్ టీం ఢిల్లీకి చేరింది. శుక్రవారం ఉదయమే వారిని ఢిల్లీకి పంపించారు. ఎనిమిది మందితో కూడా ఈ బృందం  ఢిల్లీ లిక్కర్​ స్కామ్  పరిణామాలను నిశితంగా గమనిస్తున్నది. ఇక, కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్​ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్ని్ంచనున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్ తో  భేటీ కానున్నారు. ఈ రెండు రోజులు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం. ఈడీ విచారణ పరిణామాలు, ఒకవేళ అరెస్ట్​ అయితే ఎలా చేయాలనే అంశాలపైనే మంత్రి కేటీఆర్​ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.