ఆర్టీసీ బిల్లుకు మోక్షం..! నెల రోజుల తర్వాత గవర్నర్​ తమిళ సై ఆమోద ముద్ర

ఆర్టీసీ బిల్లుకు మోక్షం..! నెల రోజుల తర్వాత గవర్నర్​ తమిళ సై ఆమోద ముద్ర

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు మోక్షం లభించింది. నెల రోజుల సుదీర్ఘ అధ్యయనం, న్యాయశాఖ పరిశీలన తర్వాత గవర్నర్​  తమిళిసై సౌందర్‌రాజన్ గురువారం ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆర్టీసీ సంస్​థలో వివిధ విభాగాలు, హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న 43వేల పై చిలుకు మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు.

ఇటీవల తాను చేసిన పది ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే ప్రతిష్టాత్మక బిల్లుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్​ ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తాజాగా గవర్నర్‌ తమిళిసైతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆమోదం తెలిపిన దాదాపు నెల రోజుల తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు. జులై 31న.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన రాష్ట్ర కెబినెట్ ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్​ కు పంపింది. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టి తీర్మాణం చేయాలని భావించిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో గవర్నర్​ అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం సమర్పించిన బిల్లుపై సందేహాలు ఉండడంతో ఆమోదం తెలిపేందుకు జాప్యం జరిగింది. గవర్నర్​ కావాలనే బిల్లును అడ్డుకుంటున్నారని ఆరోపించిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించి ఆ బిల్లును గత నెల 11న గవర్నర్‌కు తిరిగి పంపారు.అయితే బిల్లులో పలు అంశాలపై సందేహాలు వ్యక్తం చేసిన గవర్నర్​ న్యాయశాఖ పరిశీలనకు పంపారు.ఆర్టీసీ కార్మికుల భద్రత, సంక్షేమం కోసమే న్యాయశాఖ వివరణ కోరారు. ఇదే క్రమంలో పది అంశాలపై వివరణ కోరగా.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో గురువారం ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు.