గుట్టలుగా నోట్ల కట్టలు

గుట్టలుగా నోట్ల కట్టలు
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పోలీసుల తనిఖీలు
  • భారీగా దొరుకుతున్న ఆధారాలు లేని డబ్బు, బంగారం, వెండి  
  • ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్న పోలీసులు
  • రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు
  • మూడు రోజుల్లో రూ.10 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో లెక్కపత్రం లేని నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి పట్టుబడుతోంది. మూడు రోజుల్లో రూ.10 కోట్లకు పైన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ తరలింపును నివారించేందుకు రాష్ట్ర సరిహద్దులు సహా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలను చూపించని నగదు, బంగారం, వెండి, మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. లెక్కపత్రం ఎలాంటి ఆదారాలు లేని నగదును ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు. అయితే దొరుకుతున్న నగదు, బంగారు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి చెందినది కాకపోవడం గమనార్హం. పట్టుబడిన వారంతా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నవారే. వీరిలో ముఖ్యంగా బంగారం వర్తకులే ఎక్కువగా పోలీసులకు దొరుకుతున్నారు. తనిఖీల్లో పట్టుబడిన బంగారం, వెండిని ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు. 

కోడ్ ​వచ్చినప్పటి నుంచి కోట్లలో నగదు స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సోమవారం నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లో రూ.3.35 కోట్లు, పురానాపూల్ వద్ద రూ.15 లక్షలు, చైతన్యపురి వద్ద రూ. 25 లక్షలు, షాద్ నగర్ లో రూ.5 లక్షల నగదును తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బషీర్ బాగ్ నిజాం కాలేజీ వద్ద ఎలాంటి పత్రాలు లేని 7 కిలోల బంగారు, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో  హవాల రూపంలో తరలిస్తున్న రూ. 3 కోట్లు పట్టుబడింది. చందానగర్ లో ఆరు కిలోల బంగారు దొరికింది. సైబరాబాద్ పరిధిలో భారీగా నగదు, బంగారం తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా లాల్ పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో రెండు కిలోల బంగారం, రూ. 1.22 లక్షల నగదు పట్టుబడింది. ఆగాపూర  హామీద్ కేఫ్ చౌరస్తాలో షాహిన్ నగర్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ అని వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, బేగంబజార్ కు చెందిన దినేశ్​ప్రజాపతి నుంచి రూ. 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద కారులో తరలిస్తున్న రూ.30 లక్షలు, వనస్థలిపురంలో ఓ కారులో తరలిస్తున్న రూ.5.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శంకరపల్లి బీడీఎల్ చౌరస్తా వద్ద కారులో తరలిస్తున్న రూ. 9,38,970 కోట్లు, అదే ప్రాంతంలో మరో కారులో తరలిస్తున్న రూ. 71,50,00 నగదును పోలీసులు పట్టుకున్నారు. షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డికి చెందిన నగేశ్​అనే వ్యక్తి నుంచి రూ. 7 లక్షలు, అదే ప్రాంతంలోని జీహెచ్ఆర్ కాలనీకి చెందిన అశోక్ అనే వ్యక్తి వద్ద రూ.11.50  లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లిలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఓ పార్టీకి చెందిన మారబోయిన రఘునాథ్ యాదవ్ అనే వ్యక్తి నుంచి గచ్చిబౌలి పోలీసులు కుక్కర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి వద్ద తనిఖీల్లో ఓ వ్యాపారి కారులో తరలిస్తున్న రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఓ సూపర్ మార్కెట్ యాజమానికి చెందిన రూ. 5 లక్షలు, మధిర వద్ద తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ.12.65 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.