పైసలిస్తలేరు.. పనులు చేయం!

పైసలిస్తలేరు.. పనులు చేయం!
  • పాత  బిల్లులు రూ. 11,600 కోట్లు పెండింగ్​
  • టెండర్లకూ వెనుకాడుతున్న కాంట్రాక్టర్లు
  • కొత్త పనులు చేయలేమంటూ వెనుకంజ
  • మంజూరైన రోడ్లకు ముందుకు రాని వైనం
  • రాష్ట్రంలో 1187 రోడ్ల పనులకు అనుమతి
  • 886  పనులకు ఎవ్వరూ ముందుకు రాని వైనం

ఇదీ పరిస్థితి

  • మంజూరు చేసిన నిధులు   రూ. 2,500 కోట్లు
  • ఇప్పటి వరకు అంచనాలు   రూ. 1823 కోట్లు
  • మంజూరు చేసిన పనులు   1187
  • టెండర్లు కావాల్సిన పనులు   886
  • పురోగతిలో ఉన్నవి   301


ఒకప్పుడు ఆర్అండ్ బీ రోడ్ల నోటిఫికేషన్​ విడుదల చేస్తే చాలు, కాంట్రాక్టర్లు టెండర్ల కోసం పోటీ పడేవారు. ఒక దశలో అంతా రింగయ్యేవారు. వాటాలు పంచుకోవడం, పనులను పంచుకోవడం నిత్యం కనిపించేవి. టెండర్లకు వెళ్తే 10 నుంచి 30 శాతం లోపు లెస్ కు వేసేవారు. ఎలాగైనా పనులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వేల కోట్ల నిధులు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా  కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ‘ఈ పనులు వద్దు.. అప్పుల తిప్పలు వద్దు’ అంటూ వెనుకడుగు వేస్తున్నారు. ఊరూరా అధికారులు అంచనా వేసిన పనులు చేసేందుకు సాహసించడం లేదు.  పాత బిల్లులన్నీ పెండింగ్​పెట్టారంటూ కొత్త పనులకు టెండర్లు వేసేందుకు జంకుతున్నారు. దీంతో  రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ అద్దాల్లా మెరిపించాలని సర్కారు తీసుకున్న నిర్ణయం ముందుకు కదలడం లేదు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రగతిభవన్​ నుంచి అనుమతి చిట్టీలు ఉంటేనే ఆర్థిక శాఖ బిల్స్ ఇస్తున్నది. ప్రగతిభవన్ లోకి కాంట్రాక్టర్లకు ఎంట్రీ ఉండదు. దానికోసం ఫైరవీలు చేసుకోవాలి. ఇప్పటికే యేండ్ల నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పులు, వాటికి వడ్డీలు పెరిగాయి. ఇంకా పైరవీలు చేసుకుని, కమీషన్లు ఇచ్చి బిల్లులు తీసుకోవాలంటే మళ్లీ అప్పు చేయాలని భయపడుతున్నారు. రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించొద్దంటూ ప్రగతిభవన్ నుంచి కచ్చితమైన ఆదేశాలున్నాయి. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సెక్రెటేరియట్ చుట్టూ తిరుగుతునే ఉన్నారు. టీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బిల్లులు ఇప్పించి సాయం చేయాలని వేడుకుంటున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ల తాకిడి పెరగడంతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వాళ్లు రావద్దని చెబుతున్నారు. ఒకవేళ బిల్లుల కోసం ఒత్తిడి పెంచితే ‘ప్రగతిభవన్ నుంచి ఫోన్ చేయించండి. అప్పుడు బిల్లు రెడీ చేస్తం’ అని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతున్నది.  ఆయా శాఖల పరిధిలో రూ.11,600 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు ఇటీవల తేలింది. ప్రభుత్వం వద్ద కాంట్రాక్టు పనులు దక్కించుకున్న సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు వెంటనే బిల్లులు రాకపోవడంతో వడ్డీలు భారం పడుతోందని వాపోతున్నారు. ఆర్ అండ్ బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో చేసిన రోడ్ల పనుల బిల్లులే ఇవన్నీ. 

పనులు చేయించి.. వదిలేశారు
వర్షాలతో దెబ్బతిన్న సమయంలో రోడ్ల పనులను ఆగమేఘాల మీద చేయమని ఒత్తిడి చేశారు. అప్పటికే చాలా బిల్లులు పెండింగ్​ ఉండటంతో  కాంట్రాక్టర్లు నిరాకరించారు. కానీ, వారికి నచ్చజెప్పి పనులు చేయించారు. ఆ తర్వాత మళ్లీ ముఖం చూపించలేదు. ఇలా దాదాపుగా రూ. 1400 కోట్ల పనులు ఉమ్మడి వరంగల్, కరీంనగర్​, ఖమ్మం, నిజామాబాద్​ జిల్లాల్లో  ఉన్నాయి. ఈ బిల్లులు కూడా రూపాయి ఇవ్వలేదు. నిరుడు కురిసిన అధిక వర్షాలతో  రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు తేలాయి.  కల్వర్టులు కూలిపోయాయి. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా పనులు చేయించింది. కానీ, ఈ మరమ్మత్తులకు ప్రభుత్వం పైసా రిలీజ్ చేయడం లేదు. కొన్ని పనులకు ఏకంగా మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. 

ఇప్పటికే ఎవరూ టెండర్లు వేయడం లేదు
ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్​విభాగాల నుంచి ఏడాది కిందట నిజామాబాద్ జిల్లా  రూ.50 కోట్లు, నారాయణపేట జిల్లాలో రూ.12 కోట్లు, కరీంనగర్ జిల్లా వీణవంక, మానకొండూర్ నడుమ 34 కిలోమీటర్ల రోడ్డు పనులను రూ.56 కోట్లు, జగిత్యాల జిల్లాలో రూ.2.5 కోట్లు,  సూర్యాపేట జిల్లాలో రూ.28.33 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.50 కోట్లు, హన్మకొండ జిల్లాలో రూ. 11 కోట్ల పనులకు ఏడాది నుంచి టెండర్లు వేయడం లేదు. ఈ పనులను రివైజ్​ చేయడం, టెండర్లకు పిలువడం, క్యాన్సిల్​ చేయడం సాధారణంగా మారిపోయింది. 

అద్దాల రోడ్లకు ముందుకు రావట్లే
రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరువాలంటూ సీఎం కేసీఆర్​ ఇటీవల ఆదేశాలిచ్చారు. దీనికోసం రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ఆదేశాలు రావడమే తడువుగా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు.  గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే లింక్​ రోడ్లు అధ్వాన్నంగా మారడంతో వాటి పనులు చేసేందుకు ప్రతిపాదించారు. మొత్తం 1,187 రోడ్ల పనులను గుర్తించారు. రోడ్లతో పాటుగా కల్వర్టు పనులు చేయాలని ప్రపోజల్స్​ ఇచ్చారు. వీటికి ముందస్తుగా రూ. 1823 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇగ, టెండర్లు వేసుకోండి అంటూ కాంట్రాక్టర్లకు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. కానీ, సర్కారు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పటికే వేల కోట్ల బిల్లులు పెండింగ్​ ఉండటంతో.. కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. మాకు పాత బిల్లులు మంజూరు చేయాలంటూ డిమాండ్​ పెడుతున్నారు. అయితే, పాత బిల్లుల సంగతి తర్వాత.. ఈ కొత్త పనులకు టెండర్లు వేయాలంటూ అధికారులు నచ్చజెప్పుతున్నారు. కానీ, కాంట్రాక్టర్లు మాత్రం నమ్మడం లేదు. మొత్తం 1187 పనులకు అంచనాలు చేస్తే.. కేవలం 301 పనులను వివిధ  జిల్లాల్లో టెండర్లు వేశారు. ఇవన్నీ దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన నిర్మాణ సంస్థలకు అప్పగించారు. కానీ, ఏకంగా 886 రోడ్లు, కల్వర్టుల పనులకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పనులు చేయమంటూ నిక్కచ్చిగా చెప్తున్నారు. ఓవైపు ఉన్నతాధికారులు రోడ్ల పనుల ప్రగతిపై నివేదికలు అడుగుతుంటే.. జిల్లాల నుంచి నిల్​ అంటూ రిప్లై వస్తుంది. పాత బిల్లులకు కాంట్రాక్టర్లు డిమాండ్​ చేస్తున్నారంటూ చెప్తున్నారు. దీంతో అద్దాల రోడ్ల పనులు ముందుకు వెళ్లడం లేదు.