పింఛన్లకు బ్రేక్ పెండింగ్ లోనే దరఖాస్తులు

పింఛన్లకు బ్రేక్ పెండింగ్ లోనే దరఖాస్తులు
  • జూన్​ నుంచి నిలిపేసిన సర్కారు
  • అయినా ఆగని అర్జీల వెల్లువ
  • సీఎం ఆమోదం కోసం ఎదురుచూపులు

 ముద్ర, తెలంగాణ బ్యూరో: ఆసరా పెన్షన్ల మంజూరు మళ్లీ ఆగిపోయింది. పది లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ నిరుడు జూన్​ లో ​ ప్రకటించినా కేవలం ఆరు లక్షలే ఇచ్చారు. మిగిలిన నాలుగు లక్షల అప్లికేషన్లను పెండింగ్ లో​ పెట్టారు. జూన్​ తర్వాత ఇంకో 2.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ సర్కారు దగ్గర ఆగిపోయాయి. భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్​ కంటిన్యూ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఇలాంటి అప్లికేషన్లు కూడా దాదాపు 38 వేల వరకు ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం అప్రూవ్​ చేయడం లేదు.

 

అంతా అస్తవ్యస్తం

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను  తీసుకుంటున్నా మంజూరు ఇవ్వడం లేదు. 2018 నుంచి కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను ఆపేసిన సర్కారు ఎట్టకేలకు నిరుడు జూన్​ లో పది లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. 65 యేండ్లు దాటినోళ్లతో పాటుగా 57 యేండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పెన్షన్ ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 39.65 లక్షల ఆసరా పెన్షన్లున్నాయి. జూన్​ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం అట్టహాసంగా అర్హత కార్డులను ఇచ్చింది. ఆగస్టు వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సెప్టెంబర్ లో ఇచ్చిన జాబితా ప్రకారం 46.61 లక్షల ఆసరా పెన్షన్లున్నాయి. కొత్తగా రిలీజ్​ చేసింది ఆరు లక్షలే.

 

ఇప్పుడు ఇవ్వడం లేదు

కొత్త పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం రేపు మాపు అంటూ  తప్పించుకుంటున్నారు. కొత్త వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లను కూడా మంజూరు చేస్తలేరు. ఎక్కడన్న ఎలక్షన్​ ఉంటే అక్కడ కొన్ని పెండింగ్​ అప్లికేషన్లను బయటకు తీసి ఏదో ఇచ్చినట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిరుడు మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇదే వ్యూహం అమలు చేశారు. కేవలం మునుగోడు సెగ్మెంట్​ లో కొత్తగా తొమ్మిది వేల పెన్షన్లు ఇచ్చారు. అంతే తప్ప రాష్ట్రంలో ఎక్కడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.80 లక్షల కొత్త ఆసరా దరఖాస్తులున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ వెబ్​ సైట్​ లో అప్​ లోడ్​ చేసి సిద్ధం చేశారు. కానీ, వీటికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావడం లేదు.

 

నెల నెలా వేల అప్లికేషన్లు

ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా నెల నెలా వేల అప్లికేషన్లు వస్తున్నాయి. ఇవన్నీ దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువుల నుంచే వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని ఊళ్లలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో ఇతర ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు. ఆన్​లైన్​లో ఈ అప్లికేషన్లు అప్రూవ్డ్​గా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో శాంక్షన్ కావడం లేదు.