షా సభ రద్దు.. 

షా సభ రద్దు.. 
  • ప్రియాంక మీటింగ్​వాయిదా!
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో నేతల నిర్ణయం
  • ఆగస్టు 5న కొల్లాపూర్​సభ


 ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ నేత ప్రియాంకా గాంధి, సెంట్రల్​హోమ్​మినిస్టర్​అమిత్​షా తెలంగాణ పర్యటనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఖమ్మం, కొల్లాపూర్ లో నిర్వహించాల్సిన సభలు వాయిదా పడ్డాయి. ఖమ్మంలో ఈనెల 29న అమిత్​షా సభ నిర్వహించి సక్సెస్​చేద్దామని భావించిన బీజేపీ నేతలు.. వర్షాల ప్రభావంతో సభను రద్దు చేశారు. మోడీ 9 ఏళ్ల పాలన గురించి ప్రచారం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా తలపెట్టిన అనేక సభల్లో ఒకదానిని గతంలో ఖమ్మంలో ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరుకావాలి. అప్పటి పార్టీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ దాదాపు పూర్తిస్థాయి జన సమీకరణ కూడా చేశారు. అయితే గుజరాత్ లో వరదలు రావడంతో సభ వాయిదా పడింది. కాగా గతంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఖమ్మంలో భారీ స్థాయిలో నిర్వహించారు. ఆ తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్​ స్థాయిలో జన సమీకరణ చేయడం కుదరక బీజేపీ సభ రద్దు చేసుకుందని, దీనికి వర్షాల సాకు చూపిస్తోందని పలువురు భావిస్తున్నారు.

  • జన సమీకరణకు ఇబ్బందులు..

కొల్లాపూర్​లో ఈనెల 20న  పాలమూరు ప్రజా గర్జన పేరుతో సభ నిర్వహించాలని కాంగ్రెస్​పార్టీ ముందు నిర్ణయించింది. అనంతరం ఈ సమావేశానికి ఏఐసీసీ నేత ప్రియాంకగాంధీ రావడం లేదని వాయిదా వేశారు. ఈ విషయంపై కాంగ్రెస్​ నేతలంతా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి, ప్రియాంకగాంధీ సమయం తీసుకున్నారు. అనంతరం సభను ఈ నెల 30కి మార్చారు. అయితే వర్షాల నేపథ్యంలో 30న నిర్వహించతలపెట్టిన ప్రియాంక సభపై గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించి సభను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభకు జన సమీకరణకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.