పొత్తుల్లేవ్!

పొత్తుల్లేవ్!
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న పార్టీలు
  • తొలిసారిగా కలవని కూటములు
  • కదనరంగంలో కాలుదువ్వుతోన్న మూడు ప్రధాన పార్టీలు
  • పోటీకి సిద్ధమైన మరో ఆరు పార్టీలు 
  • ఓట్ల చీలీకపై ప్రధాన పార్టీల్లో గుబులు
  • ఆసక్తి రేపుతోన్న టీ రాజకీయాలు


తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే అన్ని పార్టీల్లో గెలుపు గుబులు పట్టుకుంది. ఖరారు కాని పొత్తులు, పత్తాలేని కూటములతో ఎవరికి వారే ఒంటరి పోరుకు సిద్ధం కావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లయింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా వచ్చే ఎన్నికలకు పార్టీలన్నీ ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించుకోవడం హాట్ టాపిక్​ గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించుకోగా, మరోవైపు కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల చర్చలు ఫలించే అవకాశాలు లేకపోవడంతో ఆయా పార్టీలు సైతం ఒంటరి పోరుకు దిగే ఆలోచనతో ఉన్నాయి.


20 ఏళ్లలో కుదిరిన పొత్తులు

తెలంగాణలో రాజకీయ పార్టీలు తొలిసారిగా ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తుల పరంపర ఉండేది. గత ఇరవై ఏళ్లలో పొత్తులను పరిశీలిస్తే.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంది. 2009లో టీడీపీ, బీఆర్ఎస్ జతకలిశాయి. 2‌014లో కాంగ్రెస్​ వైఏసీతో, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. 2018 ఎన్నికల్లో టీజేఎస్, టీపీడీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి మహా కూటమిగా ఏర్పడి బీఆర్ఎస్ పై పోటీ చేశాయి.2018 మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో జత కలిశారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగణలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్​ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్​119 స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలో దింపే కసరత్తను ముమ్మరం చేసింది. దీంతో కమ్యూనిస్టులు సైతం ఒంటరిగా దిగే ఆలోచనతో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్​ తో పొత్తు కోసం ఎదురుచూసిన కామ్రేడ్లకు సీఎం కేసీఆర్ ఝులక్ ఇవ్వడంతో కాంగ్రెస్​తో పొత్తు కోసం ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్​లో పలువురు సీనియర్లు కమ్యూనిస్టులతో పొత్తును వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య కలయిక అసాధ్యమని తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్​తో పొత్తు కుదరకపోతే వచ్చే ఎన్నికల్లో తాము 20 స్థానాల్లో పోటీ చేస్తామంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తేల్చి చెప్పారు. సీపీఎం సైతం తమకు పట్టున్న సుమారు 10 స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. 

బీఆర్ఎస్​కు మద్దతుపై క్లారిటీ ఇవ్వని ఎంఐఎం..

ఇటు బీఆర్ఎస్​మిత్ర పక్షమైన ఎంఐఎం సైతం వచ్చే ఎన్నికల్లో 50 స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని ఇది వరకే నిర్ణయించుకుంది. రెండు నెలల క్రితం బోధన్ లో పర్యటించిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒంటరి పోరు ప్రకటన చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్​కు మద్దతు ఇచ్చే విషయంలో అసదుద్దీన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ పార్టీ సైతం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టిసారించింది. ఇప్పటికే గతంలో తెలంగాణలో పాదయాత్రలు చేపట్టిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో 70 స్ధానాల్లో పార్టీ అభ్యర్థును బరిలో దించుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన ఎస్సీ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 

పోటీకి జనసేన సై..

మరోవైపు జనసేన పార్టీ సైతం తెలంగాణలో సమరానికి సై అంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి కార్యచరణ రూపకల్పనలో నిమగ్నమైన ఆ పార్టీ అధినేత పవన్ ​కల్యాణ్.. రెండు నెలల క్రితమే తెలంగాణలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్​చార్జిలను నియమించారు. వచ్చే ఎన్నికల్లో వారినే పార్టీ తరపున బరిలో దింపుతానంటూ ప్రకటించారు. పవన్ ఆదేశాలతో ఇన్​చార్జీలు సైతం ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. ఇటు రాజన్న రాజ్యం తెస్తామంటూ తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పేరిట తెలంగాణలో 4,111 కి.మీ పాదయాత్ర చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తానంటూ బీఆర్ఎస్​ నేతలకు సవాలు విసిరారు. అయితే ప్రస్తుతం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పాలేరు నుంచి టిక్కెట్​ఆశిస్తున్న షర్మిల చేరికను టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమె ఎక్కడి నుండి పోటీ చేస్తారు.? వైఎస్సార్టీపీ నుంచి పోటీకి దిగాల్సి వస్తే.. పాలేరు నుంచి తానొక్కటే పోటీ చేస్తారా.? ఇంకా ఇతర సెగ్మెంట్ల నుంచి అభ్యర్థులను బరిలో దింపుతారా..? అనే చర్చ జరుగుతోంది.

80 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న శివసేన 

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ మహారాష్ట్రలో తన పార్టీ కార్యకలాపాలు వేగవంతం చేయడంతో అక్కడి శివసేన చీఫ్​ఏక్​నాథ్ షిండే సైతం తెలంగాణపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 80 స్థానాల్లో శివసేన పోటీ చేస్తుందంటూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సింకారు శివాజీ ఇది వరకే ప్రకటించారు. మరోవైపు టీడీపీ సైతం తెలంగాణలో పోటీకి కాలుదువ్వుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతారంటూ ఇటీవల ప్రకటించారు. కాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. చివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు సైతం వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం విశేషం. రాష్ట్రం సిద్ధించి పదేళ్లవుతోన్నా.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదనీ, ఉద్యమకారులకు సముచిత స్ధానం, గౌరవం దక్కలేదనే అసంతృప్తితో వీరందరూ ఎన్నికల్లో పోటీకి నిర్ణయించుకున్నారు. 
 

భయపెడుతోన్న ఓట్ల చీలికలు!

గెలుపుపై ధీమాతో ఒంటరి పోరుకు సిద్ధమవుతోన్న రాజకీయ పార్టీలకు ఇప్పట్నంచే ఓట్ల చీలిక భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమ తమ ప్రత్యేక ఎజెండాతో పోటీకి సిద్ధమవుతోన్న పార్టీలు.. ప్రత్యర్థులు చీల్చే ఓట్లపై ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం పార్టీ 50 స్థానాల నుంచి బరిలో దిగితే మైనార్టీ ఓట్లు చీలే అవకాశాలున్నాయి. దీంతో మైనార్టీలు ఆదరించే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశాలు లేకపోలేదు. బీఎస్పీ బరిలో దిగితే.. కాంగ్రెస్​ ఎస్సీ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశాలున్నాయి. శివసేన బరిలో దిగితే బీజేపీ సంప్రదాయ ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కమ్యూనిస్టులు ఒంటరిగా బరిలో దిగితే కాంగ్రెస్​ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది. ఒకేసారి తొమ్మిది పార్టీలు ఎన్నికల పోరులో తలపడడం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఇదే తొలిసారి అని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇన్ని పార్టీల పోటీ ఏ పార్టీ గెలుపునకు సహకరిస్తుంది..? ఏ పార్టీ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చర్చ అప్పుడే మొదలైంది. ఏదేమైనా ఒకవేళ ఇన్ని పార్టీలు ఎన్నికల్లో తలబడితే సగానికి పైగా సెగ్మెంట్లలో అభ్యర్థులకు నామా మాత్ర ఓట్ల మెజార్టీ వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.