లీకు వీరులు!

లీకు వీరులు!
  • అధిష్ఠానం, మీడియా దృష్టిలో పడేందుకు నేతల స్కెచ్
  • పార్టీని వీడుతున్నట్లు అనుచరులతో ప్రచారం?
  • వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఖరారు చేయించుకునే యత్నం
  • ఎమ్మెల్యే మిస్​అయితే నామినేటెడ్ పోస్టుకు హామీలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్​నాయకుడు కారు దిగి.. త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు గతకొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో పలువురు సహచర బీఆర్ఎస్​నేతలు సదరు నాయకుడితో ఫోన్​లో మాట్లాడారు. దానిపై స్పష్టత ఇవ్వని సదరు నేత ప్రస్తుతం తన నియోజకవర్గంలో సిట్టింగ్​ఎమ్మెల్యేతో ఇబ్బందులుపడుతున్నానని తెలిసినా అధిష్ఠానం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధినేత కేసీఆర్ సదరు నాయకుడితో మాట్లాడారు. పార్టీ వీడొద్దని.. మరోసారి తాము ప్రభుత్వంలోకి రాబోతున్నామని, మంచి రాజకీయ భవిష్యత్​ఉంటుందని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ నేత కాంగ్రెస్​లో చేరిక అంశంపై సైలెంట్​అయ్యారు.

  • రసవత్తరంగా రాజకీయం..

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు ముందే తమ అభ్యర్థిత్యాలు ఖరారు చేయించుకునేందుకు ప్లాన్​వేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో తమకున్న అభిమానం.. గెలుపు అవకాశాలతోపాటు పార్టీ వీడితే ఆయా పార్టీలకు కలిగే నష్టాలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేలా పరోక్ష రాజకీయాలకు తెరలేపారు. ఇందుకు సామాజిక మాద్యమాన్ని పావుగా వాడుకుంటున్నారు. తాము త్వరలోనే ఇతర పార్టీలు మారుతున్నట్లు తమ అనుచరులతో పోస్టులు పెట్టిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఫలితంగా ఆయా పార్టీల సీనియర్లు, అధిష్ఠానాల దృష్టిని ఆకర్శించే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులు ఇలాంటి వ్యూహాలే రచిస్తున్నారు. పార్టీ మారుతున్న సమాచారం తెలిసిన వెంటనే సదరు నాయకుడితో ఆయా జిల్లాల సీనియర్లు టచ్ లోకి వస్తున్నారు. ఆ తర్వాత అధిష్ఠానం వారిని పిలిపించుకుని అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

  • గణనీయగా పెరిగిన ఆశావహులు..

నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీకి అవకాశం రాకపోతే.. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్​పదవులు, లేదా పార్టీలో కీలక పదవి, లేదా టెండర్లు అప్పగించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ లో ఆశావాహుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇటు కాంగ్రెస్ లో సుమారు 80 సెగ్మెంట్లలో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో టిక్కెట్లు రాని ఆశావాహులను పార్టీ వీడకుండా బుజ్జగించడం ఆయా పార్టీ అధిష్టానాలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. గత రెండు నెలల నుంచి తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో ఎన్నికల వాతావరణం కన్పిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల అధిష్టానాలు గెలుపు గుర్రాల అన్వేషణ మొదలుపెట్టారు. ఇందుకోసం సర్వేలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఒకటికి మించి ఆశావాహులున్న నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు చేపట్టిన సర్వేపై అభ్యర్ధుల్లో ఉత్కంఠ నెలకొంది. సర్వే రిపోర్టులు తమకు అనుకూలంగా ఉన్నాయా..? ప్రతికూలంగా ఉన్నాయా..? అని తెలుసుకోవడంతో పాటు అధిష్టాన నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పాట్లు పడుతున్నారు. ప్రతికూలంగా ఉంటే పార్టీ మార్పు సంకేతాలు ఇచ్చి అధిష్టానం నుంచి తమకు పిలుపువచ్చేలా సోషల్​మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. రానున్న రోజుల్లో మారునున్న సమీకరణాలు.. చోటు చేసుకునే పరిణామాలు రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.