భూమికి దగ్గరగా సూపర్​నోవా.. 

భూమికి దగ్గరగా సూపర్​నోవా.. 
  • 2.10 కోట్ల సంవత్సరాల క్రితం పేలుడు
  • భూమిపై ఇప్పుడు కనిపిస్తోన్న విస్ఫోటనం!

న్యూఢిల్లీ: భూమికి అత్యంత దగ్గరగా ఓ సూపర్​నోవా (ఖగోళంలో పేలుడు వల్ల కనిపించే నక్షత్రం) ఆకాశం నిర్మలంగా ఉంటే దీన్ని అందరూ చూడొచ్చని ఖగోళ శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీనిలో వరుస పేలుళ్ళు సంభవిస్తున్నాయన్నారు. ఈ నక్షత్రం ఎం–101 గెలాక్సీలో ఉందన్నారు.  దీనికి ఎస్​ఎన్​–2023 ఐఎక్స్​ఎఫ్​గా నామకరణం చేశామన్నారు. ఈ సూపర్​ నోవా ‘భూచక్రం’ మాదిరి తిరుగుతోందన్నారు. ఈ సూపర్​నోవాను న్యూయార్క్​కు చెందిన ఎస్ర్టో ఫోటోగ్రఫర్​ స్టీవిన్​ బెలావీయ్​ కనిపెట్టారు. ఈయన ఓ ఐలాండ్​నుంచి 21 ఏప్రిల్​న ఈ చిత్రాన్ని తీశారు. దీనిపై వివిధ పరిశోధనలు సాగించిన అనంతరం నిర్ధారించుకొని మే 21 ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఓ కొత్త నక్షత్రం ఏర్పడుతోందని ముందుగా దీన్ని పరిశీలించిన శాస్ర్తవేత్తలు భావించారు. కానీ దీన్ని సూక్ష్మంగా పరిశీలించిన అనంతరం ఇది అంతరించిపోతున్న నక్షత్రంగా తేల్చారు. భూమి నుంచి దీని దూరం 2.10 కోట్ల ప్రకాశసంవత్సరాలుగా గుర్తించారు. అంటే ఈ విస్ఫోటనం చెంది కూడా 2.10 కోట్ల సంవత్సరాలు అవుతుందని శాస్ర్తవేత్తలు లెక్కగట్టారు. ఇప్పటికి గానీ దాని వెలుగు మన భూమిని చేరిందన్నారు. దీని నుండి వెలువడే కాంతి కిరణాలపై శాస్ర్తవేత్తలు దృష్టి పెట్టారు. మరిన్ని కొత్త విషయాలు ఏవైనా గోచరిస్తాయేమోననే ఉద్దేశ్యంతో దీనిపై దృష్టిపెట్టామని స్టీవిన్​ నేతృత్వంలోని బృందం పేర్కొంది.