ఎన్​ఎంఎంఎల్​ పేరు మార్పు.. హస్తంపై జేపీ నడ్డా ఫైర్​

ఎన్​ఎంఎంఎల్​ పేరు మార్పు.. హస్తంపై జేపీ నడ్డా ఫైర్​

ఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కేంద్రంలోని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా తీవ్రంగా స్పందించారు. ఒక కుటుంబానికి ఊడిగం చేస్తూ, బానిస మనస్తత్వంతో ఉన్న కాంగ్రెస్ నేతలకు సదరు రాజవంశానికి మించిన నేతలు దేశానికి సేవ చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పీఎం సంగ్రహాలయం అనేది రాజకీయాలకు అతీతమైందని, దీనిని గ్రహించే దృక్పథం కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు లేదని విమర్శించారు నడ్డా. ఒక కుటుంబ వారసత్వం, చరిత్ర మాత్రమే మనుగడలో ఉండేలా, మునుపటి ప్రధానుల సేవలను, వారి పేర్లను తుడిచివేయడమే మార్గంగా పని చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు సంగ్రహాలయం పేరు మార్పుపై కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పీఎం సంగ్రహాలయంలో ప్రతి ప్రధానికి గౌరవం ఉందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. పండిట్ జవహార్ లాల్ నెహ్రూ‌కు సంబంధించిన విభాగాన్ని మార్చలేదని స్పష్టం చేశారు. పైగా పేరుతో మార్పులు ఈ సంగ్రహాలయం ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. 50 ఏళ్లకు పైగా భారతదేశాన్ని పాలించిన పార్టీకి ఈ కుంచిత మనస్తత్వం నిజంగా బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఈ కుంచిత మనస్తత్వం కారణంగానే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.