కెనడాలో ఖలిస్థానీ నేత నిజ్జార్​ హత్య!

కెనడాలో ఖలిస్థానీ నేత నిజ్జార్​ హత్య!

కెనడా: ఇటీవలే భారత్​ జారీ చేసిన మోస్ట్​వాంటెడ్​40 మంది నేరస్థుల జాబితాలో ఉన్న ఖలీస్థాన్​ నాయకుడు హర్దీప్​సింగ్​ నిజ్జార్​హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఉన్న సర్రీ పట్టణంలోని గురుద్వారా ఆలయం బయట ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నిజ్జార్​ను తుపాకులతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు. నిజ్జార్​గురునానక్ సిక్ గురుద్వారాకు అధ్యక్షునిగా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు అధినేతగా కొనసాగుతున్నాడు.  హర్దీప్ సింగ్‌‌పై పంజాబ్​లో అల్లర్లను సృష్టించేందుకు, హింసకు పాల్పడేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలున్నాయి. భారత్‌లో నిషేధించిన సిక్స్ ఫర్ జస్టీస్ అనే వేర్పాటువాద సంస్థతో కూడా హరిదీప్‌కు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతని ఆచూకీ తెలియజేస్తే రూ.10 లక్షల రివార్డును కూడా భారత్​ ప్రకటించింది. కెనడాలో ఉన్న వారిని ఖలిస్థాన్​ ఉద్యమం పేరుతో రెచ్చగొడుతూ.. దేవాలయాలపై దాడులకు తెగబడడంలో కూడా ఇతని పాత్ర ఉన్నట్లు ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. పలుమార్లు ఇతని ఆచూకీ లభించి భారత్​బృందాలు ఇతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా నిజ్జార్​ తృటిలో తప్పించుకున్నాడు. మరోవైపు కెనడా–భారత్​ల మధ్య నేరస్థుల అప్పగింతల ఒప్పందంపై కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్​ బృందాలు ఇతనిపై ఓ కన్నేసి ఉంచినట్లు మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.