ఠారెత్తిస్తున్న ఎండలు

ఠారెత్తిస్తున్న ఎండలు
  • పిట్టల్లా రాలుతున్న జనాలు
  • ఎండల తీవ్రతపై ఐఎండీ హెచ్చరికలు
  • పలు రాష్ర్టాల్లో స్కూళ్లకు సెలవులు
  • భానుడి ప్రకోపానికి 11యేళ్ల రికార్డులు బద్ధలు

న్యూఢిల్లీ: దేశంలోని ఉత్తరాది, దక్షిణాదిలో పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇప్పటికే యూపీ, బిహార్​ రాష్ర్టాల్లో వందమందికిపైగా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఎండలు 11 సంవత్సరాల రికార్డు బద్దలు కొడుతుండడంతో ఆయా రాష్ర్టాలు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించాయి. బీహార్‌ ఈ నెల 24 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. కో, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో రానున్న 24 గంటలపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. అంతకుముందు 2012లో 19 రోజుల పాటు నిరంతరంగా వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.

తీవ్ర ఎండల కారణంగా గోవా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల సెలవులను పొడిగించారు. . పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. జూన్‌ రెండో వారం ముగిసినప్పటికి దేశంలో చాలా చోట్ల రుతుపవనాల జాడేలేదు. మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడు దంచికొడుతున్నాయి.  ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వడగాల్పుల కారణంగా బీహార్‌లో 7 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. బీహార్‌ , ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. . యూపీ లోని బలియాలో 72 గంటల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఎండల తీవ్రతకు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఎండల తీవ్రతకు స్థానిక ఆసుపత్రులన్నీ రోగులతో, వడదెబ్బ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వడగాలులకు డీహైడ్రేషన్, జ్వరం, డయేరియా తదితర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. సాధారణ అనారోగ్యాలతో పాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్యలో కూడా పెరుగుదల నమోదవుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.