తీస్ హజారీ కోర్టులో  కాల్పుల కలకలం

తీస్ హజారీ కోర్టులో  కాల్పుల కలకలం
  • న్యాయవాదుల ఘర్షణ
  • ఖండించిన ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ 

న్యూఢిల్లీ : వాదనా పటిమతో న్యాయాన్ని గెలిపించవలసిన న్యాయవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళనకరం.  ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదుల మధ్య ఘర్షణ కాల్పుల వరకు వెళ్లింది. కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఘర్షణలో పాల్గొన్నారు. అయితే గాల్లోకి కాల్పులు జరపడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం సంభవించలేదు. ఈమేరకు నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా పాల్గొన్నారని చెప్పారు. న్యాయవాదుల్లో రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందని, వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఓ వ్యక్తి గాలిలోకి తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని, పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ న్యాయవాది మీడియాకు ఇచ్చారు. ఓ న్యాయవాది గాలిలోకి కాల్పులు జరుపుతున్నట్లు, మరో ఇద్దరు రాళ్లు విసురుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఈ ఘటనను ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ తీవ్రంగా ఖండించారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతామని చెప్పారు.