షరతులు తొలగించాలి 

షరతులు తొలగించాలి 
  • బిల్లు ఇప్పుడే అమలు చేయాలి 
  • రాహుల్​గాంధీ డిమాండ్​

న్యూఢిల్లీ: బీజేపీకి, మోడీ ప్రభుత్వానికీ మహిళల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉంటే మహిళా బిల్లును వెంటనే ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ వంటి నిబంధనలను ఎందుకు జోడించారని నిలదీశారు. కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ఓటర్లను, మహిళలను మభ్యపెట్టి మరో పదేళ్లు ముందుకు జరిపి బిల్లును అప్పుడు అమలు చేస్తారో? లేదో ఎవరికి తెలుసని అన్నారు. అసలు అప్పటి వరకూ మీ ప్రభుత్వం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఓబీసీ వర్గాల క్షేమమని ప్రధాని మాట్లాడుతుంటారని, బిల్లులో ఓబీసీ వర్గాలను ఎందుకు చేర్చడం లేదో చెప్పాలన్నారు. ఇంత చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ రెండు అంశాలను పక్కన పెట్టి, ఇప్పుడే మహిళా రిజర్వేషన్​అమలు చేయాలని డిమాండ్​ చేశారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఎంతమంది ఉన్నారో కులగణన తర్వాతే తేలుతుందన్నారు. ప్రజల, ఓటర్ల, మహిళల దృష్టి మళ్లించి రాబోయే ఎన్నికలలో లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు కులగణన జరిగిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఎందుకు బయటకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఓబీసీల రిజర్వేషన్​ కోసం కాంగ్రెస్​ పోరాడుతుందన్నారు. బీజేపీ దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో విజయకేతనం ఎగురవేస్తామని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు.