ఇక భారత్​సింగపూర్​ల మధ్య డిజిటల్​ చెల్లింపులు

ఇక భారత్​సింగపూర్​ల మధ్య డిజిటల్​ చెల్లింపులు
  • ఇరుదేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు
  • సేవలు సులభతరం, బందాలు బలోపేతమే లక్ష్యమన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత్​ సింగపూర్​ల మధ్య డిజిటల్​ చెల్లింపుల ఒప్పందం చారిత్రాత్మక విజయమని దీంతో ఇరుదేశాల బంధాలు మరింత బలోపేతం అవుతాయని, తద్వారా సింగపూర్​లో నివసించే భారతీయులకు సులభంగా నగదు బదిలీ చేయొచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు.  డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఇరుదేశాల మధ్య డిజిటల్​ చెల్లింపుల ఒప్పందాలను సంతకాలు చేసి ప్రారంభించారు. భారతదేశం యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సింగపూర్‌లోని ‘పే నౌ’ని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్​ చెల్లింపుల రంగంలో నూతన అధ్యాయానికి భారత్​ శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా సింగపూర్​భారత్​ల మధ్య మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించడమే గాకుండా నగదు చెల్లింపులు కూడా సులభతరం అవుతాయన్నారు. ఎంతోమంది భారత వ్యాపారులు సింగపూర్​లో వ్యాపారం చేస్తున్నారన్నారు. విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటున్నారన్నారు. వీరికి ఇక్కడి నుంచి బ్యాంకు ద్వారా కాకుండా ఇక నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సులభతమవుతుందన్నారు. భారత్​ నుంచి అనేక వస్తువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్​ చెల్లింపులు కీలక భాగస్వామ్యాన్ని పోషిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.