రాహుల్  సభ ముందు క్షమాపణ చెప్పాలి : రాజ్​నాథ్​ సింగ్​

రాహుల్  సభ ముందు క్షమాపణ చెప్పాలి : రాజ్​నాథ్​ సింగ్​

పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాలు తొలి విడత జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగిన సంగతి  తెలిసిందే. దాదాపు నెల రోజుల విరామం తర్వాత.. రెండో విడత సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రులు.. లండన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం గురించి ప్రస్తావించారు. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్ లో భారత్ ను అవమానించారని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలని కోరారు. రాహుల్ గాంధీని సభ ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.   ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా లోక్ సభలో ప్రస్తావించారు. అయితే రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై ప్రహ్లాద్ జోషి మాట్లాడుతున్న సమయంలో.. అందుకు నిరసనగా ప్రతిపక్ష నేతలు సభా వెల్‌లోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.  ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 16 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మరోవైపు విపక్ష నేతలు పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.