విశ్వాసంతోనే ప్లీనరీకి

విశ్వాసంతోనే ప్లీనరీకి

కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో శుక్రవారం నుంచి  ప్రారంభం కానుంది. ఇందులో 2024 పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచనకు సంబంధించి చర్చ జరుగనుంది. సమావేశానికి ముందు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 2024 లో కాంగ్రెస్ నేతృత్వం లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎంతో నమ్మకంగా ఇచ్చిన స్టేట్మెంట్ దాదాపు అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో  కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లీనరీకు ముందు ఖర్గే స్టేట్మెంట్ రావడం ఒక వ్యూహంగానే భావించవచ్చు. కాంగ్రెస్ కు ఈసారి 150 నుంచి 200 సీట్లు ఖాయంగా వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నది. ఆప్, టీఎంసీ, బీఆర్ఎస్, బిజూ జనతాదళ్ తప్ప మిగిలిన విపక్షాలు కాంగ్రెస్ తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని రీజినల్ పార్టీల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మంచి సీట్లు వచ్చి, ఖర్గే అన్నట్లు సంకీర్ణం అవసరమైతే మిగిలిన విపక్షాలు కూడ కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే, కేవలం అదానీ స్కాం లాంటివే ఎన్నికలను ప్రభావితం చేయలేవు. బీజేపీకి 2019లో 303 సీట్లు వచ్చినా, ఓట్లు 41 శాతానికి పైనే  వచ్చాయి. విపక్షాలకు మొత్తంగా 58 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 23 శాతం ఓట్లు రాగా, మిగతా విపక్షాలన్నింటికి కలిపి 35 శాతం వచ్చాయి. బీజేపీ పరిస్థితి గతంలో మాదిరిగా  లేదు. భావోద్వేగాల ఉపన్యాసాలు, డైలాగులు, మతం పేరిట మనుషుల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడాలు తప్ప పీఎం నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతల దగ్గర వేరే ఎజెండా లేదు. వాటిని వినే పరిస్థితులలో జనం లేరు.

వారిని విడదీయాలని
విపక్షాలు ఒక్కటి కాకుండా బీజేపీ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది. విపక్షాలలో విభజన ఇప్పుడు బీజేపీకి అనివార్యం అయిపోయింది. నిజానికి కాంగ్రెస్ వ్యూహం ఎప్పుడు కూడా సైలెంట్ గానే ఉంటుంది. ఖర్గే ఏఐసీసీ చీఫ్ అవుతారని ఎవరూ ఊహించలేదు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ఇంత విజయవంతంగా సాగుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. ఈ క్రమంలోనే, రాయపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీని డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతల మీద, కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నవారి మీదా ఈడీ దాడులు జరిపించినా కాంగ్రెస్ శ్రేణులు చెక్కు చెదర లేదు. ‘భారత్ జోడో యాత్ర’ కు కూడా  అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరిగాయి. రాహుల్ ను వ్యక్తిగతంగా బద్నాం చేసే కుట్రలు జరిగాయి. రాహుల్ ను, సోనియాగాంధీ ని విచారణల పేరిట గంటల తరబడి ఇబ్బంది పెట్టారు. అయినా వారు జంక లేదు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ ముఖ్య నేతలను కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టింది. అయినా, కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడలేదు. రాయ్ పూర్ ప్లీనరీ వైపు బీజేపీ సహా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ చూస్తున్నాయి. 

అనేకానేక సమస్యలు
దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగింది. దేశం మీద 155 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. అధికధరలకు అంతు లేదు. చివరికి ఉపాధిహామీ పథకంలో సగం మందికి కనీసం 30 రోజుల ఉపాధి లభిస్తలేదు. రైతుల ఆదాయం పెరిగే బదులు తగ్గింది.17 కోట్ల మంది మధ్యతరగతి కుటుంబాలు, పేదల జాబితాలకు వచ్చేసారు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ప్లీనరీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2011 నుంచి 2022 దాకా దేశం నుంచి 16 లక్షల మంది విదేశాలకు వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకున్నారు. బిజినెస్ సెక్యూరిటీ ఉంటుందని, చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని, ఎక్కువ శాతం మనదేశం నుంచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. మెడికల్, ఇంజనీరిరింగ్, మాస్టర్ డిగ్రీలకు ఎక్కవ శాతం అమెరికా, ఆ తర్వాత కెనడా,ఆస్ట్రేలియా,లండన్ కు వెళుతున్నారు. హయ్యర్ స్టడీస్ కు విదేశాలే బెటర్ గా భావిస్తున్నారు. 2021లో 1.63 లక్షల మంది, 2022 లో 2.25 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. దేశంలో ముస్లిములు, దళితులు, ఆదివాసీలను టార్గెట్ చేసి సాగిస్తున్న అమానవీయ దాడులు భరించలేని పరిస్థితి ఉంది. ఈ విషయాల మీద కూడా కాంగ్రెస్ ప్లీనరీలో దృష్టిని సారించాలి. పెరుగుతున్న అసమానతలు, దేశంలో మనుషుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీని మీద కూడా చర్చించాలి.