చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే..

చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే..

దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ.. భారత్, చైనా మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ . హిమాలయ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం.. 'అసాధారణ, సవాళ్ల దశ'కు చేరుకుందని తెలిపారు. దిల్లీలో శనివారం జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''భారత్‌, చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో ఇరు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయి. ఇతర ఘర్షణ ప్రాంతాల వద్ద సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ.. హిమాలయాల్లోని సరిహద్దుల్లో చైనాతో పరిస్థితులు ఇప్పటికీ పెళుసుగా, ప్రమాదకరంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి'' అని జైశంకర్‌ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బంధం ముందుకెళ్లాలంటే.. ఈ సరిహద్దు ప్రతిష్టంభనను చైనానే పరిష్కరించాలని కేంద్రమంత్రి తెలిపారు.