కరీంనగర్ లో పొలిటికల్ హీట్

కరీంనగర్ లో పొలిటికల్ హీట్
Political heat in Karimnagar
  • దుమారం రేపిన బండి వ్యాఖ్యలు
  • కవిత ఈడి విచారణతో బి ఆర్ ఎస్ లో టెన్షన్
  • లిక్కర్ కేసు ఓ డ్రామా అంటున్న కాంగ్రెస్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ లో పొలిటికల్ హీట్ పిక్ స్టేజ్ కి చేరింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  కవితపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తూ బిఆర్ఎస్, బిజెపి దుమ్ము దులుపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ బి ఆర్ ఎస్ శ్రేణుల్లో లో టెన్షన్ పుట్టిస్తుంది. దీంతో కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినప్పటినుండి రాష్ట్రంలో రాజకీయ విలువలు పడి పోయాయి అంటూ బిజెపి శ్రేణులు ఫైర్ అవుతున్నారు.  మహిళా దినోత్సవం రోజు విలేకరులు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం ఇస్తూ "కేసుల్లో ఉన్న వారిని విచారణ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా" అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది.

దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డీజీపీని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేదంటూ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తూ బిఆర్ఎస్, బిజెపి పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవిని కాపాడుకోవడం కోసం బిజెపితో లోపాయికార ఒప్పందం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఓ రాజకీయ  నాటకం. ఈడి తలచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలో అరెస్టు చేయవచ్చు. అలా చేయకుండా రాజకీయ ప్రయోజనం కోసం ఢిల్లీ ఎక్సైజ్ కేసును వాడుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉండేలా ఆ రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయని మండిపడుతున్నారు.

ఈనెల 9న కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చత్తీస్గడ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సభలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకొని కేసీఆర్ బంధువులు వేలకోట్ల సంపాదిస్తున్నారని విమర్శలు చేశారు. గ్రానైట్, సాండ్, ల్యాండ్ మాఫియాలు బి ఆర్ ఎస్ నాయకుల అండతో రెచ్చిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ లోని కేంద్ర రాష్ట్ర నాయకులు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత విషయం బిజెపి శ్రేణుల్లో సంతోషం నింపింది. కవిత అరెస్టు ఖాయమంటూ బిజెపిలో జోరుగా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.