Meat Alert: కృత్రిమ మాంసంతో పర్యావరణ విధ్వంసమే

Meat Alert:  కృత్రిమ మాంసంతో పర్యావరణ విధ్వంసమే

ముద్ర, నేషనల్​: జంతుజాలం ద్వారా లభించే మాంసం స్థానంలో భారీ ఎత్తున ల్యాబ్‌లలో కృత్రిమంగా ఉత్పత్తి చేసే మాంసంతో పర్యావరణానికి పెను ప్రమాదం కలుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మాంసం తయారీ వల్ల 25 రెట్లు ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం జంతు కణ ఆధారిత మాంసం (ఏసీబీఎం) తయారీ చాలా చిన్న స్థాయిలో జరుగుతున్నది. అదికూడా అధిక వ్యయం అవుతున్నది. ఇదే పద్ధతిలో ఉత్పత్తిని గణనీయంగా పెంచితే ప్రపంచ బీఫ్‌ ఇండస్ట్రీ ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల కంటే 25 రెట్లు అధిక కాలుష్యం విడులవుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. బీఫ్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఏసీబీఎం రంగానికి వేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారు.

నిజానికి ల్యాబ్‌లో ఉత్పత్తి చేసే కృత్రిమ మాంసం వలన పశువులను పెంచడానికి అవసరమయ్యే భూమి, నీళ్లు, జంతువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసేందుకు యాంటిబయాటిక్స్‌ వాడకం ఇవన్నీ అవసరం ఉండదు. అయితే.. కృత్రిమ మాంసం ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల విషయంలో తగిన విశ్లేషణ జరుగలేదన్న అభిప్రాయాన్ని ఈ నివేదిక తయారీ భాగం పంచుకున్న శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. కృత్రిమ బీఫ్‌ను భారీ స్థాయిలో రిఫైన్‌ చేస్తారు. దాని వల్ల.. సాధారణ బీఫ్‌తో పోల్చితే ప్రతి కిలో కృత్రిమ మాంసం తయారీ క్రమంలో 246 నుంచి 1508 కిలోగ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. ఈ లెక్కలను ఆధారం చేసుకుని చూస్తే.. సాధారణ బీఫ్‌ తయారీ కంటే కృత్రిమ బీఫ్‌ తయారీలో పర్యావరణానికి కలిగే ముప్పు 4 నుంచి 25 రెట్ల వరకు ఎక్కవ ఉండే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.