క్షేమంగా చేరుకున్నా విక్రమ్ తొలి మెసేజ్

క్షేమంగా చేరుకున్నా విక్రమ్ తొలి మెసేజ్
  • చంద్రయాన్–3 సూపర్ సక్సెస్
  • జాబిల్లిపై కాలు మోసిన ల్యాండర్​
  • ఉత్కంఠ మధ్య సేఫ్ గా ల్యాండింగ్
  • 18 నిమిషాలు కొనసాగిన ప్రకియ
  • అంతరాయం లేకుండా చంద్రుడి చెంతకు
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత్
  • ఆగ్రదేశాల సరసన నిలిచిన ఇండియా 
  • ఇది నవ భారతానికి నాంది: ప్రధాని మోదీ 
  • దేశానికి గర్వ కారణం: సీఎం కేసీఆర్
  • దేశమంతటా మిన్నంటిన సంబురాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చరిత్ర సృష్టించింది. అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన తరుణంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్–3 విక్రమ్ ల్యాండర్‌ 41 రోజుల ప్రయాణం తరువాత, దేశ ప్రజలు ఊపిరి బిగబట్టి చూస్తుండగా బుధవారం సాయంత్రం విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధృవంపై దిగింది. ‘నేను నా గమ్యస్థానానికి చేరుకున్నా’ అంటూ తొలి మెసేజ్ ను పంపించింది. అంతే, ఇస్రోలో సంబురాలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారత అంతరిక్ష శాస్త్రవేత్తల మీద అంతులేని ప్రశంసల వర్షం కురిసింది. సాయంత్రం 5.44 గంటల నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 6.09 గంటలకు ల్యాండర్ సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది 


(ముద్ర, నేషనల్ డెస్క్)బెంగళూరు: విక్రమ్ ను చందమామ మీద సురక్షితంగా దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిరుపమాన కృషి చేశారు. ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) కమాండ్‌ను పంపించారు. దీనిని అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ ఏఐ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. తన నాలుగు థ్రాటల్‌బుల్ ఇంజిన్లను మండించి తన వేగాన్ని తగ్గించుకుంది. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 30 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉండగా రఫ్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఆ ఫేస్ సజావుగానే సాగినట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 1200 మీటర్స్ పర్ సెకండ్ గా ల్యాండర్ వేగం ఉంది. ఒక్కసారి ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్ (ఏఎల్ఎస్) యాక్టివేట్ అయిన అనంతరం గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎలాంటి కమాండ్స్ ఇవ్వబోరని లైవ్ స్ట్రీమింగ్ కామెంటరీలో చెప్పారు. చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలో మీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్ వర్టికల్ వెలాసిటీ 31 మీటర్స్ పర్ సెకండ్, హారిజాంటల్ వెలాసిటీ 1058 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉంది. అప్పుడు హారిజాంటల్ వెలాసిటీ 745 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 67 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలో మీటర్లకు పైగా దూరం ల్యాండర్ ప్రయాణించింది. 

ఒక్కో దశ దాటుకుంటూ

రఫ్ బ్రేకింగ్ ఫేస్ తర్వాత స్టాండ్ బై స్టేజ్ లేదా ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేస్ మొదలు అయింది. తర్వాత పైన్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఇది మూడు నిమిషాలపాటు జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలాంటి కమాండ్స్ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఇవ్వలేదు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 120 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 28 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సరిగ్గా ఈ టైంలో ఉపరితం నుంచి ఎత్తు 1.2 కిలో మీటర్లుగా ఉంది. ఆ తర్వాత ల్యాండర్ ఉపరితలానికి లంబకోణం చేస్తూ తిరిగింది. మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ ఉంది. చంద్రుడిపై దిగే ముందు హారిజాంటల్ వెలాసిటీ 0.4 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ గా ఉండి చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది.

విజయాల బాటలోనే

చంద్రయాన్–-2 ఫెయిల్ అయినప్పటికీ, భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన ప్రయోగాలతో చంద్రయాన్–3 కి శ్రీకారం చుట్టింది. చంద్రుని మిషన్‌లో అమెరికా 26 సార్లు విఫలమైతే రష్యా 14 సార్లు విఫలమైనప్పటికీ భారత్ మాత్రం చంద్రయాన్–3 దశలలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది ఈ మిషన్ ప్రారంబించారు. చంద్రయాన్ మిషన్ ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. తర్వాత కూడా పలు సంఖ్యలో మిషన్‌లను ప్రయోగించనుంది. రోవర్ అక్కడ తిరగడమే కాదు, ఖనిజాలను పరిశీలించడం, చంద్రుడి మీద ఖనిజాలను తవ్వి తీయడం, ఆ తవ్వి తీసిన ఖనిజాలను భూమి పైకి తీసుకురావడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. నాసా తలపెట్టిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ తరహాలో మనిషిని కూడా చంద్రుడి మీదికి పంపించే లక్ష్యం కూడా ఇస్రోకు ఉన్నదని కొందరు నిపుణులు చెబుతున్నారు. 
 
అంతర్జాతీయ ఖ్యాతి

ఇస్రో ప్రస్తుతం దాదాపు 50 దేశాలకు పైగా అనేక సంస్థలు, ప్రభుత్వాలతో ఒప్పందాలు కలిగి ఉంది. కమ్యూనికేషన్ విభాగంలో ఇస్రో ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, అలాగే తక్కువ ఖర్చుతో టెక్నాలజీని ఉపయోగిస్తుందనే పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చంద్రయాన్ ద్వారా ఇస్రో ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఇతర దేశాలు సైతం చంద్రుని పరిశోధనలో భాగస్వామ్యం అవడం ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.  భవిష్యత్తులో చంద్రుడిపైన ఇస్రో ఇతర గ్రహాలపై వెళ్లేందుకు లాంచింగ్ స్టేషన్ కనుక ప్రారంభించినట్లయితే.  ఇస్రో ఆధీనంలోని ఆ లాంచింగ్ స్టేషన్  ఉపయోగించుకునేందుకు పలు దేశాలు మనతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది తద్వారా రెవెన్యూ మరింత పెరుగుతుంది.