మోసపోతే గోస పడతాం

మోసపోతే గోస పడతాం
  • ఎన్నికలొస్తె కొందరు కొత్త బిచ్చగాళ్లు దిగుతారు
  • ఎవరేంటో గుర్తిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు
  • కాంగ్రెస్​అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తరు
  • ఆ పార్టీని బంగాళాఖాతంలో విసిరేద్దాం
  • మెదక్​సభలో ముఖ్యమంత్రి కేసీఆర్​

ముద్ర ప్రతినిధి, మెదక్: ‘ప్రతిపక్షాల మాయమాటలకు మోసపోతే గోస పడతాం. ఎన్నికలు రాగానే ఆగం కావద్దు. ధీరత్వం ప్రదర్శించాలె. ఎవరు ఏంటో గుర్తించాలె.’ అని సీఎం కేసీఆర్​ప్రజలకు సూచించారు. మెదక్ సీఎస్ఐ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం మాట్లాడారు. 

ప్రజా సేవకులను గుర్తిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు..

ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేశాయి.. ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్లాల వ‌ద్దకు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.  నిజ‌మేంది, వాస్తవ‌మేంది, ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్రజా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లయితే బ్రహ్మాండ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయన్నారు. అభివృద్ధి కూడా బాగా జ‌రిగే అవ‌కాశం ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.  ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు గ‌తంలో ఎప్పుడూ నీళ్లు రాలేద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ లీడర్లు అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. 

ఘ‌న‌పురం కాల్వల్లో నీళ్ల కోసం ధర్నా చేసెటోళ్లు..

కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘ‌న‌పురానికి నీళ్లు కావాలంటే మెద‌క్‌లో ఆర్డీఓ ఆఫీసు వ‌ద్ద ధ‌ర్నా చేయాల్సి వచ్చేదన్నారు. ప్రతి సంవ‌త్సరం ధ‌ర్నా చేస్తే త‌ప్ప నీళ్లు వ‌చ్చేవి కావన్నారు. ఘ‌న‌పురం కాల్వల‌లో తుమ్మ చెట్లు మొలిచేవి. కానీ నేను సీఎం అయ్యాక ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘ‌న‌పురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వలు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎక‌రాల‌కు నీళ్లు అందిస్తున్నామన్నారు. గ‌త కాంగ్రెస్ నాయ‌కులు సింగూరు ప్రాజెక్టుకు హైద‌రాబాద్‌కు ద‌త్తత ఇచ్చి ఇక్కడ మ‌న పొలాలు ఎండ‌బెట్టారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెద‌క్‌ జిల్లాకే డెడికేట్ చేసుకోవ‌డం కార‌ణంగా బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయన్నారు. ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంట‌లు పండించుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతును బాగు చేయాల‌నే సంక‌ల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. 

గుట్టకొకరు.. పుట్టకొకరు..

తెలంగాణ రాక‌ముందు చెట్టుకొకరు, గుట్టకొక‌రు అయిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. భూమి ఉన్నా కూడా హైద‌రాబాద్ వ‌చ్చి ఆటో రిక్షా న‌డిపే స్థాయికి దిగ‌జారిపోయారు. దీంతో తెలంగాణ ఏర్పడ‌గానే రైతును ఏ విధంగానైనా స‌రే బాగు చేయాల‌నే సంక‌ల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకన్నామన్నారు. రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేస్తున్నామని, 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామని తెలిపారు. 

కేంద్రం రూ.25 వేల కోట్లు న‌ష్టం క‌లిగించింది..

ఇవాళ రెండు పార్టీలో మ‌న‌తో బ‌రిలో ఉన్నాయని, బీజేపీ మోటార్లకు మీట‌ర్లు పెట్టాల‌ని చెబుతోందన్నారు. క‌రెంట్ మోటార్లకు మీట‌ర్లు పెట్టక‌పోవ‌డంతో కేంద్రం దాదాపు రూ.25 వేల కోట్ల న‌ష్టం క‌లిగించిందన్నారు. కానీ ఆ బాధ‌ను అనుభ‌వించుకుంటూ ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్టమ‌ని చెప్పినట్లు సీఎం తెలిపారు. ఇటీవల కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్.. ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేసిందని, గెలిచిన తెల్లారే అక్కడ 7 గంట‌ల క‌రెంట్ ఇస్తోందన్నారు. తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇచ్చుకుంటున్నామని తెలిపారు.

న‌దులపై చెక్‌డ్యాంలు కట్టుకున్నం..

మెద‌క్‌లో పారే హ‌ల్దీ వాగు, మంజీరా వాగుల‌పై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు క‌ట్టుకుని ఆ న‌దులు 365 రోజులు స‌జీవంగా ఉండేలా చేసుకుంటున్నామన్నారు. కాళేశ్వరంలో భాగంగా మ‌ల్లన్న సాగ‌ర్ ద్వారా అక్కణ్ణుంచి అవ‌స‌ర‌మున్నప్పుడ‌ల్లా వాగుల్లో నీళ్లు విడుద‌ల చేస్తున్నామని, చెక్ డ్యాంలు మ‌త్తళ్లు దుంకుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు 1000కి పైగా జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసి జాతీయ స్థాయిలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబడుతున్నారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ వస్తే ధరణిని తొలగిస్తారట..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తారని కేసీఆర్​పేర్కొన్నారు. ధరణి తీసుకురావడంతో స్వయానా పట్టాదారు మాత్రమే పేరు మార్చుకునే అవకాశం ఉందని, ఎవరికి ఎలాంటి అధికారం లేదని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పటివరకు 37 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ ఇవ్వకుండా.. తెలంగాణలో గెలిస్తే రూ.4 వేలు  పింఛన్​ఇస్తామనడం మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో మరో ఆరేడు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్​తెలిపారు. 

కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ భవన్ ప్రారంభం

మెదక్ జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ భవన్ ను సీఎం కేసీఆర్​బుధవారం ప్రారంభించారు. నూతన కలెక్టరేట్​లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, బీఆర్ఎస్ భవన్​లో జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు అందించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.