కోల్​కత్తాలో అండర్ ​వాటర్​ మెట్రో!

కోల్​కత్తాలో అండర్ ​వాటర్​ మెట్రో!
  • రూ. 120 కోట్లతో 33 మీటర్ల లోతులో నిర్మాణం
  • చివరి దశల్లో ప్రాజెక్టు పనులు
  • డిసెంబర్​లో ప్రారంభానికి సన్నాహాలు
  • వెల్లడించిన కేఎమ్​ఆర్​సీ అధికారులు

కోల్​కత్తా: దేశంలోనే తొలిసారిగా తొలి అండర్ వాటర్ మెట్రో రైలును కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఇందుకు సంబంధించిన చివరి దశ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు కేఎమ్ఆర్‌సీ అధికారులు తెలిపారు. కోల్‌కతాలోని హుగ్లీ నది అడుగు భాగం నుంచి ఈ అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. కోల్‌కతా నగరంలోని తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపు ప్రాంతాన్ని కలిపే మొత్తం 16 కిలోమీటర్ల పొడవునా ఈ మెట్రోను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కేవలం 4.8 కిలోమీటర్ల దూరం మాత్రమే నీటి అడుగు భాగంలో నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఎస్ప్లానేడ్ నుంచి హౌరా స్టేడియం వరకు ఈ అండర్ వాటర్ మెట్రో ప్రయాణించనుంది. ఈ రూట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి 12 నిమిషాలకు ఒక మెట్రో ప్రయాణించనున్నట్లు కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ అండర్ వాటర్ మెట్రో తొలి దశ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక జూన్ 2024లో పూర్తి 16 కిలోమీటర్ల కారిడార్‌లో మెట్రో సేవలు విస్తరించనున్నట్లు చెప్పారు.

దేశంలోనే మొట్టమొదటగా ఒక నది కింద మెట్రో రైలు నిర్మాణం ఎంతో సంక్లిష్టంగా ఉందని శ్రీవాత్సవ తెలిపారు. ఈ మొత్తం కారిడార్‌లో సీల్దా నుంచి హౌరా స్టేడియం వరకు ఉన్న 2.4 కిలోమీటర్ల మార్గం మరింత సంక్లిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నది లోపల మెట్రో రైల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని.. నవంబర్ చివరి వారంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక మెట్రో రైలు మార్గంలో టన్నెల్‌లోకి నీరు ప్రవేశించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 1.4 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ రింగ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్‌ గాస్కెట్లను బిగించారు. అయితే ఇలాంటి టెక్నాలజీని యూరోస్టార్‌ అనే కంపెనీ లండన్‌, పారిస్‌ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసినట్లు కేఎమ్ఆర్‌సీ వెల్లడించింది.

ఈ అండర్ వాటర్ మెట్రో రైల్ టన్నెల్‌ అందుబాటులోకి వస్తే కోల్‌కతా - హౌరా మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. సెక్టార్‌ వి - హావ్‌ డా మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని పేర్కొన్నారు. హౌరా నుంచి సెల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుందని.. అదే ఈ అండర్ వాటర్ మెట్రో ద్వారా కేవలం 40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని తెలిపారు. దీంతోపాటు రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు. అయితే ఏదైనా టెక్నికల్ సమస్యలతో ఆ టన్నెల్‌లో మెట్రో రైల్ ఆగిపోతే ప్రయాణికులు పక్కనే ఉన్న వాకింగ్ ట్రాక్ నుంచి బయటికి రావచ్చని తెలిపారు. లండన్, పారిస్ నగరాల మధ్య ఉన్న ఈ అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు త్వరలోనే కోల్‌కతాలోనూ ప్రారంభం కానున్నాయి. ఈ మెట్రో టన్నెల్ నిర్మాణానికి దాదాపు రూ.120 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 మీటర్ల లోతుగా ఉంటుందని తెలిపారు.