విశ్వాసాలపై దాడి

విశ్వాసాలపై దాడి
  • బానిసత్వంలోకి తీసుకువెళతారా?
  • సనాతన వ్యాఖ్యలపై ప్రధాని మండిపాటు
  • అహంకార పూరితం ఇండియా కూటమి నేతల ఆలోచనలు
  • మధ్యప్రదేశ్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

భోపాల్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్​ అయ్యారు. సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశాన్ని మళ్లీ వెయ్యేళ్ల క్రితం ఉన్న బానిసత్వంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు.. అహంకార కూటమి (ఘమండియా కూటమి )ని ఎలా నడపాలని వ్యూహాలు రచించారని మండిపడ్డారు. భారత దేశ సంస్కృతిపై దాడి చేయడం కోసం ఒక రహస్య ఎజెండాను నిర్ణయించుకున్నారని విమర్శలు గుప్పించారు. భారతీయుల సంస్కృతి, విశ్వాసాలపై దాడి చేయాలని.. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.

దేశ కోసం ప్రాణాలు అర్పించిన వారు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని వివరించిన ప్రధాని.. దేవి అహల్యాబాయి హోల్కర్‌ వంటి వారికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార కూటమి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. సనాతన ధర్మం ఇచ్చిన బలంతో ఝాన్సీ లక్ష్మీబాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి.. ఆమె తన ఝాన్సీ రాజ్యాన్ని వదులుకోనని చెప్పినట్లు ప్రధాని గుర్తు చేశారు. మరోవైపు.. సనాతన ధర్మం తన జీవితానికి ఎంతో అవసరమని మహాత్మాగాంధీ చెప్పారని.. తాను రాముడి నుంచి స్ఫూర్తి పొందానని చెప్పినట్లు తెలిపారు. అందుకే ఆయన కన్నుమూసే సమయంలో హే రామ్ అన్నారని వెల్లడించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ కూడా సనాతన స్ఫూర్తితో జీవించారని పేర్కొన్నారు. అందుకే వారు బ్రిటీష్ పాలకుల చేత ఉరితీయబడిన సమయంలో మళ్లీ భారత మాతలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి సనాతన ధర్మమే వారికి ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

శంకుస్థాపనలు..

సాగర్‌లోని బీనాలోని బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) రిఫైనరీలో రూ.50 వేల కోట్లతో నిర్మించనున్న పెట్రో కెమికల్ ప్లాంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు 1800 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. వీటిలో నర్మదాపురంలోని ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ జోన్, ఐటీ పార్క్-3, 4 ఇండోర్, మెగా ఇండస్ట్రియల్ పార్క్ రట్లం, 6 ఇండస్ట్రియల్ పార్కులు (నర్మదాపురం, గుణ, షాజాపూర్, మౌగంజ్, అగర్-మాల్వా, మక్సీ) ఉన్నాయి.బుందేల్ ఖండ్ వాసులు ధైర్యసాహసోపేతులని ప్రధాని మోడీ అన్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి సాగర్‌కు వచ్చి మీ అందరినీ చూసే అదృష్టం కలిగడం సంతోషకరమన్నారు. మీ అందరి మధ్యకు వచ్చి మిమ్మల్ని చూసే అవకాశం కల్పించినందుకు శివరాజ్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. సెయింట్ రవిదాస్ జీ గ్రాండ్ మెమోరియల్ భూమి పూజ సందర్భంగా నేను చివరిసారి మీ మధ్యకు వచ్చానని గుర్తు చేశారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కొత్త శక్తిని ఇస్తాయన్నారు.