మన లక్ష్యం ‘వికసిత భారత్’

 మన లక్ష్యం ‘వికసిత భారత్’
  • అంకిత భావంతో ముందుకు వెళదాం
  • బానిస సంకెళ్లను తెంచుకొని స్ఫూర్తిగా నిలిచాం
  • అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్​ను నిలిపాం
  • ఎన్నో ఆటంకాలు దాడుతూ అమృతోత్సవాల నిర్వహణ
  • ఇపుడు ప్రపంచమంతా మనవైపే చూస్తోంది
  • ప్రతి భారతీయుడు గర్వపడేలా ’సెంట్రల్ విస్టా’ నిర్మాణం
  • వాస్తు, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగానికి ఇది ప్రతీక
  • కొత్త మార్గాలతోనే కొత్త నమూనాలు సృష్టించబడతాయి
  • సాధువుల ఆశీస్సులతోనే సెంగోల్‌ పున: ప్రతిష్ఠ 
  • నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 

స్వాతంత్ర్యం సాధించిన ఈ 75 సంవత్సరాలలో భారతదేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మరో 25 యేళ్లలో ‘వికసిత భారత్’ వైపు అడుగులు వేసేందుకు మనమంతా నూతన పార్లమెంట్​ వేదికగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్‌ అమృతోత్సవాలను నిర్వహించుకుంటోందని అన్నారు. నూతన పార్లమెంట్ భవనంలో కొలువుదీరిన ప్రతీ ఒక్కరూ తమ తమ కర్తవ్యాలను మనసా వాచా కర్మనా అంకిత భావంతో నిర్వహించి దేశవాసులలో విశ్వాసం, నమ్మకాన్ని పెంపొందించేలా వ్యవహరించాలని సూచించారు.

నవభారత్ కొత్త లక్ష్యాలు
కొత్త మార్గాలలో నడవడం ద్వారానే కొత్త నమూనాలు సృష్టించబడతాయని ప్రధాని పేర్కొన్నారు. నేడు నవ భారత్ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోందని, కొత్త ఉత్సాహం, కొత్త దిశ, కొత్త దృష్టి మొదలైందని అన్నారు. వికసిత భారత్​కోసం నవీన పంథాలో ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమే కాదు. ప్రజాస్వామ్యానికి జనని అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలన్నారు. ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం అన్నారు. కొత్త భారతావనికి ఆజాదీకా అమృతకాలం మార్గం కావాలన్నారు.  గడిచిన తొమ్మదేళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. అనేక గ్రామాలను కలుపుతూ నాలుగు లక్షల కి.మీ. రోడ్లు వేశామన్నారు.


ముద్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: 
ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ, చరిత్రలోనూ కొన్ని సమయాలు శాశ్వతంగా నిలిచిపోతాయని, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం కూడా అటువంటిదేనని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా భారతీయులందరినీ అభినందిస్తున్నానన్నారు. ఈ అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహూకరించుకున్నారని అన్నారు. నూతన పార్లమెంటు కేవలం ఓ భవనం కాదని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెంట్రల్ విస్టా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు హవనం, యాగం, పూజలతో ప్రారంభోత్సవం మొదలైంది. అనంతరం ప్రధాని మోడీని ఆశీర్వదించిన 18 మంది మఠాధిపతులు తమిళనాడు సెంగోల్‌ను ఆయన చేతికి అందించారు. పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ప్రధాని మోడీ సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం దానిని పార్లమెంట్ భవన్​లో ప్రతిష్ఠించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, వీర్ సావర్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి. పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను సత్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ  ప్రపంచం మొత్తం ఇపుడు భారత్‌ వైపు ఆశతో చూస్తోందని అన్నారు. రాబోయే కాలంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు భారత కొత్త పార్లమెంటు పని చేస్తుందన్నారు. 

విశ్వానికి స్ఫూర్తి ప్రదాతగా
బానిస సంకెళ్లను తెంచుకొని ఎన్నో దేశాలకు భారత్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి సాకార దిశలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగుతోందన్నారు. 140  కోట్ల ప్రజలకు పార్లమెంట్ వేదికగా అభివృద్ధి ఫలాలను అందించడంలో సఫలీకృతులం అవుదామన్నారు. రాబోయే రోజులలో మరిన్ని ఎంపీ సీట్లు పెరగనున్న దృష్ట్యా నూతన పార్లమెంట్​భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. టెక్నాలజీ పరంగా అత్యున్నత స్థాయిలో భవనం రూపుదిద్దుకుందన్నారు. దీనిని చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో  నిండిపోతుందని అన్నారు. ఇందులో వాస్తు శిల్పం, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగం కూడా ఉన్నాయన్నారు. లోక్‌సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలి, రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్పం కమలం నమూనాలో ఉంటుందన్నారు. పార్లమెంట్ ఆవరణలో జాతీయ వృక్షం మర్రి చెట్టు కూడా ఉందన్నారు. ఈ కొత్త భవనం మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే సాధనంగా మారుతుందన్నారు. భారత్ స్వావలంబన సూర్యోదయానికి సాక్ష్యంగా నిలిచిందన్నారు. 

పాత భవనంలో ఇక్కట్లు
పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇక్కట్లు ఎదురయ్యేవని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కూర్చోవడానికే కాదు, సాంకేతికంగానూ అనేక సమస్యలు వచ్చేవన్నారు. రానున్న రోజులలో ఎంపీల సంఖ్య పెరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగానే ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామన్నారు. కొత్త పార్లమెంటు లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. పవిత్ర సెంగోల్​కు తన గౌరవం తిరిగి లభించిందన్నారు. సాధువుల ఆశీస్సులతోనే మనం పవిత్ర సెంగోల్‌కు దాని గౌరవాన్ని తిరిగి ఇవ్వగలిగామని అన్నారు. ప్రజాస్వామ్యం మనకు ఒక ఆలోచన, ఒక సంప్రదాయం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం రూ. 75 నాణేన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక స్టాంపును కూడా విడుదల చేశారు. 

స్వాగతాలు, బహిష్కరణలు
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని 25 రాజకీయ పార్టీలు స్వాగతించగా, కాంగ్రెస్‌ సహా 19 రాజకీయ పార్టీలు వేడుకను బహిష్కరించాయి. యూపీ సీఎం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఏపీ సీఎం జగన్, మాజీ ప్రధాని దేవేగౌడతోపాటు ఇతర ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు హాజరయ్యారు. 20 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు, వివిధ రాష్ర్టాల ప్రముఖులు పాల్గొన్నారు.