బిహార్​లో పడవ ప్రమాదం

బిహార్​లో పడవ ప్రమాదం
  • 18 మంది విద్యార్థులు గల్లంతు

బిహార్​:బిహార్‌లో గురువారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. విద్యార్థులతో వెళ్తోన్న పడవ మునిగి.. 18 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థులు పడవలో పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పొరుగున ఉన్న గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే.. విద్యార్థులు నది దాటాల్సిందే. మధుపూర్ పట్టి గ్రామానికి చెందిన విద్యార్థులకు పడవ ఒక్కటే దిక్కు. ప్రమాద సమయానికి 34 మంది విద్యార్థులు పడవలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. భాగమతి నదిలో మధుపూర్ పట్టీ ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ జిల్లా పర్యటనలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘటనపై స్పందించారు. తక్షణమే జిల్లా మేజిస్ట్రేట్ సహా ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని.. సహాయక చర్యలపు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామని నితీశ్ స్పష్టం చేశారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వివరించారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. నదిలోకి దూకి కొంత మంది విద్యార్థులను రక్షించారు. సురక్షితంగా 20 మంది విద్యార్థులను బయటకు తీశారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు సామర్థ్యానికి మించి పడవలో విద్యార్థులను ఎక్కించడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.