కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్టు

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్టు

బెంగళూరు: లంచం కేసులో బీజేపీ  ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడటం కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగింది. బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్ష ను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీఎత్తున ఆందోళనకు దిగడంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  సహా పలువురుని పోలీసులు అరెస్టు చేశారు.  రూ.40 లక్షలు లంచంగా తీసుకుంటూ విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదల్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, ఆ వెనువెంటనే ఆయన ఇంటిలో లోకాయుక్త సిబ్బంది జరిపిన దాడుల్లో రూ.6 కోట్లకు పైగా లెక్కల్లో చూపించని సొమ్ము శుక్రవారం పట్టుబడటం సంచలనమైంది. బెంగళూరు వాటర్ సప్లయి అండ్ సెవరేజ్ బోర్డు చీఫ్ అకౌంటెంట్‌గా ఉన్న ప్రశాంత్ కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) కార్యాలయం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మైసూర్ శాండిల్ సోప్ తయారీదారులైన కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా మాదల్ విరూపాక్ష ఉన్నారు.  రాష్ట్రంలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం పని చేస్తోందంటూ కాంగ్రెస్ గత కొంత కాలంగా పోరాటం చేస్తోంది. తాజాగా రూ.40 లక్షలు తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడటం తమ వాదనకు బలం చూకూరుస్తోందంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. "రాష్ట్రంలో తీవ్ర అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ అడుగుతున్నారని మేము ఎప్పుడు చెప్పినా ప్రభుత్వం ఆధారాలివ్వమని అడుగుతోంది. ఎమ్మెల్యే కొడుకు 40 శాతం కమిషన్ తీసుకుంటూ పట్టుబడటం ఆధారం కాదా?'' అని మాజీ సీఎం సిద్ధరామయ్య నిలదీశారు. ఇదే విషయాన్ని నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి నిలదీశారు. కుంభకోణాలు, అవినీతి రాష్ట్రంలో అప్రహతిహతంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలు అడుగుతోందని, ఇదే సాక్ష్యమని, ముఖ్యమంత్రి బొమ్మై రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.