పుల్వామాలో ఎన్ఐఏ దాడులు

పుల్వామాలో ఎన్ఐఏ దాడులు
  • 40 మంది వేర్పాటువాద నేతలు అరెస్ట్​
  • విద్రోహ చర్య కోసమే సమావేశమా?
  • అప్రమత్తమైన కేంద్రం

జమ్మూకశ్మీర్​: కేంద్ర ఇంటలిజెన్స్​సమాచారంతో ఎన్ఐఏ జమ్మూకశ్మీర్ లోని పుల్వామా సహా 5 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మంగళవారం జరిపిన దాడుల్లో పలు కీలకపత్రాలు, డిజిటల్, ఎలక్ర్టానిక్ డివైజ్​లను స్వాధీనం చేసుకొని, పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివరాలను ఎన్ఐఏ వెల్లడించలేదు. ఇప్పటికే సోమవారం రాత్రి ఎన్ఐఏ, పోలీసులు కలిసి జరిపిన దాడిలో 40 మంది వేర్పాటువాద నేతలను అరెస్టు చేశారు. వీరంతా ఓ హోటల్లో సమావేశమైనట్లు సమాచారం అందడంతో ఎన్ఐఏ.. పోలీసుల సహకారంతో వారిని అరెస్టు చేసింది. మరోవైపు వర్షాలు, వరదల నేపథ్యంలో ఇదే అదనుగా భావిస్తున్న పాక్​ఉగ్రమూకలు భారత సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ చెక్​పోస్టులను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్​లో పలువురు వేర్పాటువాద నేతలు ఐఎస్ఐతో చేతులు కలిపారన్న సమాచారం ఎన్ఐఏకు చేరింది. స్థానికంగా విద్రోహ చర్యకు పాల్పడే అవకాశం ఉండడంతో వీరందరినీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఎన్ఐఏ జరిపిన దాడుల్లో పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాడులపై వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని భద్రతాధికారులు స్పష్టం చేశారు. వివరాలు వెల్లడించకపోవడంతో మరిన్ని దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురి కీలక సమాచారం దొరికిన నేపథ్యంలోనే దాడులు కొనసాగుతున్నాయని, వివరాలు బయటికి పొక్కితే నిందితులు తప్పించుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు పోలీసులు వెల్లడించడం విశేషం.