ప్రచారానికి కూటమి సిద్ధం

ప్రచారానికి కూటమి సిద్ధం
  • ఎంపీలోనే మొదటి సభ
  • బీజేపీకి వత్తాసు పలుకుతున్న మీడియాకు ఆహ్వానాలొద్దని నేతల నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలంతా కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అనేక సమావేశాల తర్వాత మధ్యప్రదేశ్‌లో తమ మొదటి బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లోఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 మంది కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్ మొదటి వారంలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఇండియా కూటమిలోని పార్టీల సభ్యులంతా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూడా కూటమిలోని పార్టీలన్నీ కలిసి త్వరలోనే చర్చించనున్నాయి. ఈ విషయాన్ని డీఎంకే నేత టీఆర్ బాలు ధృవీకరించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు కూడా కూటమి త్వరలో సీట్ల పంపకంపై చర్చలను ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.

బీజేపీకి వత్తాసు పలుకుతున్న పలు మీడియా సంస్థలను తమ కార్యక్రమాల్లో పాల్గొననీయకుండా ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ఉన్నాయి. రాహుల్​గాంధీ భారత్​జోడో యాత్రను కూడా మీడియా సంస్థలు చిన్నవి చూసి చూపాయని అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒక నెల పాటు టీవీ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని మీడియా ఛానెల్‌లు/ఎడిటర్‌లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని అభ్యర్థిస్తున్నాం" అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో(ఎక్స్) ఓ ట్వీట్ పెట్టడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ మీడియాను నిషేధించడం ఇది కొత్తేం కాదు. 2019లో కూడా ఒక నెల పాటు టెలివిజన్ షోలను నిషేధించింది. కాగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను కూడా ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది.