పాపాలను కడిగేసుకునేందుకే ఆ పేరు

పాపాలను కడిగేసుకునేందుకే ఆ పేరు
  • ఇండియాపై మోడీ ఫైర్​
  • 14వ విడత పీఎం కిసాన్​ డబ్బులు విడుతల
  • 9 కోట్ల మంది ఖాతాల్లో రూ. 20వేల కోట్లు
  • రాజస్థాన్​లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం

రాజస్థాన్​: యూపీఏ, కొన్ని విపక్ష పార్టీల అవినీతి, అక్రమాలు బయటపడకూడదనే అన్ని పార్టీలు కలిసి ఇండియాగా రూపాంతరం చెందాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. గురువారం రాజస్థాన్​లోని సీకార్​ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. యూపీఏ తన పాపాలను కడిగేసుకునేందుకు పేరు మార్చుకుందన్నారు. నేడు దేశంలో కాంగ్రెస్​ పార్టీ దశ దిశ లేని పార్టీగా మిగిలిపోయిందన్నారు. ఓ వర్గంపై, సంస్థపై ఆరోపణలు చేస్తూ వాటిని తులనాడుతూ కాంగ్రెస్​ పార్టీ ఇన్ని రోజులు తమ పబ్బం గడుపుకుందన్నారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో ఆ ఆటలు కొనసాగకపోవడంతో యూపీఏను కాస్త ఇండియాగా రూపాంతరం చెందించారన్నారు. దేశ శత్రువులను కాపాడేలా కాంగ్రెస్​ పార్టీ అనేకసార్లు వ్యవహరించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ఆ పేరును రూపుమాపుకునేందుకు నేడు ఇండియా అనే కొత్త ముసుగు కప్పుకొని వస్తోందని దీనితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలనుద్దేశించి అన్నారు. పేర్లు ఎన్ని మార్చుకున్నా వీరి పనుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదన్నది ప్రజలు గమనించాలన్నారు. ఒకవేళ వీరికి నిజంగా దేశంపై అంత ప్రేమే ఉంటే భారత అంతర్గత వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న విదేశాల నేతలతో మాట్లాడేవారన్నారు. గతంలో వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీరు ఈ ప్రయత్నాలు చేయలేదన్నారు. తమ సైనికులు ‘వన్​ర్యాంక్​’ పెన్షన్​అడిగితే ఇయ్యలేదన్నారు. ఇండియా విపక్షాల్లో భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. వీరందరిలో తీవ్ర అహంకారం పెల్లుబుకుతోందన్నారు. 

  • అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని సికార్‌లో రూ.1.25 లక్షల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, యూరియా గోల్డ్‌ను ప్రారంభించారు. 8.5 కోట్ల మందికి పైగా రైతులకు 17,000 కోట్ల రూపాయలను పిఎం-కిసాన్ నిధులను విడుదల చేశారు. చిత్తోర్‌గఢ్, ధోల్‌పూర్, సిరోహి, సికార్, శ్రీ గంగానగర్‌లలో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రధాని ప్రారంభించారు. రాజస్థాన్ అంతటా ఏడు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఉదయపూర్, బన్స్వారా, పర్తాప్‌గఢ్, దుంగార్‌పూర్, జోధ్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయ తివ్రీ జిల్లాల్లో ఉన్న ఆరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రధాన మంత్రి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్​యోజన కింద 14వ విడత డబ్బులను 9 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ. 2000 చొప్పున రూ. 20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం జమ చేసింది. ఈ డబ్బులను కూడా ఇదే సభలో ప్రధాని విడుదల చేశారు.