మొత్తానికి  మెప్పించావ్‌ బ్రో

మొత్తానికి  మెప్పించావ్‌ బ్రో

నటీనటులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, కేతిక శ‌ర్మ‌, ప్రియాప్ర‌కాష్ వారియ‌ర్‌, రోహిణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: థ‌మ‌న్ ఎస్‌
నిర్మాతలు: టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
దర్శకుడు : స‌ముద్ర‌ఖ‌ని
రిలీజ్ డేట్‌: జూలై 28, 2023
ర‌న్ టైం: 134 నిమిషాలు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా బ్రో. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌యం సీతం సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ చిత్రాన్ని కోలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వ బాధ్యతలు వహించాడు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో 'ముద్ర' స‌మీక్ష‌లో చూద్దాం.

కథ....
మార్కండేయ ( సాయిధ‌ర‌మ్ తేజ్‌) తండ్రి చిన్న తనంలోనే చనిపోవడంతో బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీదపడతాయి.  దాంతో ప్రతిదానికి తాను చాలా కష్టపడుతూ ప్రతి చిన్న విషయానికి కూడా ఇబ్బందికరంగా బాధపడుతూ ఉండేవాడు. దాంతో త‌న స్వార్థం తాను త‌ప్ప ఎవ్వ‌రిని ప‌ట్టించుకోడు. చివ‌ర‌కు చెల్లి ఫీజు క‌ట్టాల‌న్నా కూడా స‌వాల‌క్ష కార‌ణాలు చెపుతుంటాడు. త‌న‌కు ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని.. తాను జీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. అలాంటిది  అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. పైకి వెళ్లాక బ్రో దేవుడు ( ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) తో గొడ‌వ ప‌డ‌తాడు. తాను మ‌రి కొద్ది రోజులు బ‌తికేందుకు టైం ఇవ్వాల‌ని వేడుకుంటాడు. తాను లేకపోతే తన కుటుంబమంతా వీధిన పడుతుందని ఏమీ జరగదని బాధపడుతూ... చివ‌ర‌కు ప‌వ‌న్ కండీష‌న్ మీద 90 రోజులు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చేలా ప‌ర్మిష‌న్‌ ఇస్తాడు. ఈ లోగా అత‌డు భూమి మీద చేయాల్సిన పనులు అన్నీ చేసుకుని వ‌స్తాను అంటాడు. తిరిగి వ‌చ్చాక ఇటు చెల్లి పెళ్లి… అటు త‌న పెళ్లి, ఇటు అమ్మ‌కు ఆరోగ్యం బాగోక‌పోవ‌డం… ఇటు జీఎం అవ్వాల్సిన టైంలో ఉద్యోగం పోవ‌డంతో అన్ని  స‌మ‌స్య‌ల ఒకటేసారి వచ్చి ప‌డిపోతాయి. ఈ టైంలో బ్రో అత‌డిని ఎలా న‌డిపించాడు ? అత‌డి జీవితం ఎలా మ‌లుపులు తిరిగింది ? ఈ క‌థ ఏమైంది ? అన్న‌దే ఈ చిత్ర కథాంశం.

విశ్లేష‌ణ :
ప‌వ‌న్ – సాయి కాంబినేష‌న్‌లో ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే సీన్ల‌లో కావాల్సినంత కామెడీతో పాటు బాగా ఎంజాయ్ చేయొచ్చు. త్రివిక్రమ్‌ పంచ్‌ పటాక్‌లు బాగా సినిమాలో బాగా పేలాయి అని చెప్పవచ్చు.  చ‌నిపోయిన సాయిధ‌ర‌మ్‌కు 90 రోజుల టైం ఇవ్వ‌డంతో పాటు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు సాయితేజ్ ప‌క్క‌నే ఉంటూ సాయిని వాచ్ చేస్తూ క‌థ‌ను న‌డిపించ‌డం కాస్త సినిమాటిక్ గా అనిపించినా చూడ‌డానికి బాగుంది. సెకండాఫ్‌లో వ‌చ్చిన ఒక యాక్ష‌న్ సీన్ మాత్రం ఏదో ఫైట్‌ పెట్టాలి అంటే పెట్టాలి అన్నట్లు అనిపించింది.  సెకండాఫ్ కామెడీతో పాటు కాస్త ఎమోష‌న‌ల్ సీన్ల‌తోక‌థ‌ను న‌డిపిన తీరు బాగుంది. అయితే సినిమాలో ఎంద‌రో న‌టీన‌టులు ఉన్నా వారిని కాద‌ని మొత్తం ప‌వ‌న్‌, సాయి మీదే సినిమా మొత్తం నడుస్తుంది. అయినా కూడా చూడ‌డానికి బాగుంది. సెకండాఫ్‌లో కుటుంబ స‌భ్యులు అంద‌రూ క‌లిసి మార్కండేయ‌ను మోసం చేయ‌డం… ఆ షాకుల‌తో సాయిధ‌ర‌మ్ స్ట‌న్ అవ్వడం కాస్త ట్విస్ట్‌గా అనిపించింది.

ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌తో చంపేశాడు. దేవుడుగా సాయిధ‌ర‌మ్ తేజ్ వెన‌కే ఉంటూ పేల్చే డైలాగులు, పంచ్‌లు ఇక పవన్‌ మేజ‌రిజ‌మ్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇంకా చెప్పాలంటే మ‌నం త‌మ్ముడు, బద్రి, ఖుషీ స్టైల్ నాటి ప‌వ‌న్ మేరిజ‌మ్స్‌ను మ‌రోసారి చూశామని చెప్పాలి. ఇక ఫ్యాన్స్‌ విషయానికి వస్తే మాములుగా ఎంజాయ్‌ చేయలేదు. ఈ వ‌య‌స్సులో కూడా ప‌వ‌న్‌లో ఎన‌ర్జిటిక్‌, ఆ ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇందులో ప‌వ‌న్‌కు హీరోయిన్లు, డ్యూయెట్లు లేక‌పోయినా ఊర‌మాస్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టేశాడు. భూమ్మీద‌కు వ‌చ్చిన ప్ర‌తి వాడు గెస్టే.. ఎప్పుడో ఒక‌ప్పుడు టైం అయిపోయాక వెళ్లిపోవాల్సిందే.. అన్న డైలాగ్  దద్దరిల్లిపోయింది.  అంతే కాని మేం దోచేస్తాం.. అది చేస్తాం ఇది చేస్తాం అంటే అంటూ...అని చిటికె వేస్తాడు. ఈ డైలాగ్ ఏపీ ప్ర‌భుత్వానికి  కాస్త త‌గిలిన‌ట్టుగా ఉంటుంది.

ప‌వ‌న్ పాత సినిమాల్లో పాట‌లు ప్లే చేస్తూ డ్యాన్సులు వేయ‌డం.. ఎలివేష‌న్లు ఇవ్వ‌డం ఫ్యాన్స్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు జోష్ నింపింది. వినోద‌యం సీతం సినిమా మెయిన్ లైన్ తీసుకున్నా దానిని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేసిన దర్శకుడు సముద్రఖనికి హ్యాట్సాఫ్‌ చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు మ‌నం కొన్న టిక్కెట్‌కు అయితే డోకా ఉండ‌దు. సినిమాను బాగానే ఎంజ‌య్ చేస్తాం. త్రివిక్ర‌మ్ మాట‌లు బాగున్నా.. స్క్రీన్ ప్లే పర్లేదనిపించింది. 

 సినిమా ఆద్యంతం ప‌వ‌న్‌ను హైలెట్ చేసేందుకు.. ప‌వ‌న్ హీరోయిం చూపించేందుకే స‌రిపోయింది. ఎంత ఫ్యాన్‌ మూవీ  అనిపించినప్పటికి ప్రతీ ప్రేక్షకుడు బోర్‌ ఫీలవ్వకుండా సినిమాని ఎంజాయ్‌ చేస్తాడు. సినిమా మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే క‌థ‌లో పెద్ద మ‌లుపులు ఉండ‌వు. ప్లాట్‌గానే ఉంటుంది. ఎమోష‌న‌ల్ పార్ట్ కూడా ఓకే. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల స్లో అయిన‌ట్టు ఉంటుంది. అది త‌ప్పా మేజ‌ర్ మైనస్‌లే అయితే ఏమీ లేవు.


న‌టీన‌టుల పెర్పామెన్స్ :
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌న్ మ్యాన్ షో చేసేశాడు. ఈ సినిమాకు మెయిన్ ఫిల్ల‌ర్‌ అని చెప్పాలి. కేవ‌లం 20 రోజుల కాల్షీట్ల‌తో ప‌వ‌న్ ఈ స్థాయి పాత్ర‌తో సినిమా చేయ‌డం గ్రేట్‌. ప‌వ‌న్ ఛ‌రిష్మా, క్రేజ్‌, జోష్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సాయిధ‌ర‌మ్ కూడా మార్కండేయ‌గా పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు. యాక్సిడెంట్ త‌ర్వాత సాయి కాస్త లావుగా కనిపించడం సహజం. కొంచం తగ్గితే బావుండు. హీరోయిన్ కేతిక‌శ‌ర్మ తో పాటు ప్రియ ప్ర‌కాష్ వారియ‌ర్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. వెన్నెల కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణితో పాటు సాయి త‌ల్లిగా రోషిణి పాత్ర‌ల‌లో వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు.


టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….
టెక్నిక‌ల్‌గా థ‌మ‌న్  వేస్ట్‌ అని చెప్పవచ్చు ఎందుకంటే తన పాటలు రిపీట్‌ చెయ్యడం తప్పించి సినిమాలో ఎక్కడా పెద్దగా థమన్‌ మార్క్‌ ఏమీ కనిపించలేదు. పాట‌లు అంత‌గా క్లిక్ కాలేదు. కానీ నేప‌థ్య సంగీతంతో మాత్రం అద‌ర‌గొట్టాడు.. ఇక ఎడిటింగ్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. కొన్ని చోట్ల సీన్ల ప‌రంగా ల్యాగ్ అయిన‌ట్టు ఉన్నా అది ద‌ర్శ‌కుడు.. స్క్రీన్ ప్లే త‌ప్పిద‌మే త‌ప్పా ఎడిట‌ర్ త‌ప్పుకాదు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాణ విలువ‌లు సినిమాకు, క‌థ‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.  త్రివిక్ర‌మ్ మాట‌లు కొన్ని చోట్ల బాగా పేలాయి. గ‌ర్ల్‌ఫ్రెండ్సేమో తాగించేస్తారు. చెల్లెల్లేమో దించేస్తారు లాంటి మాట‌లు బాగున్నాయి. చాలా సీన్ల‌లో బెట‌ర్‌గా రాసుకునే అవ‌కాశం ఉన్నా కూడా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు లేదు. 


ఫైన‌ల్‌గా…
బ్రో ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని చెప్పవచ్చు. ఓ మ‌నిషి పుట్టుక‌, చావు మ‌ధ్య ప‌డే సంఘ‌ర్ష‌ణ‌లు ఎలా ఉంటాయి ? మ‌నిషి జీవితంలో ఎన్నో క‌ష్ట‌సుఖాలు ఎలా ? ఎద‌ర్కొంటాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంది. చ‌నిపోయిన మ‌నిషికి 90 రోజుల మ‌ళ్లీ బ‌తికే అవ‌కాశం వ‌స్తే అప్పుడు త‌న కుటుంబ స‌భ్యుల సంబంధాలు, తాను నెర‌వేర్చే ప‌నుల మ‌ధ్య ఎలా ? న‌లిగిపోతాడ‌న్న‌ది బాగా ప్ర‌జెంట్ చేశాడు. ఏదైనా అంతేకదా మనకి ఏదైనా దూరం అవుతుంది అంటేనే కదా దాని విలువ మరింతగా తెలుసుకుని మన కర్తవ్యాలని నెరవేర్చాలని చూస్తాం. ఇదీ ఇంచుమించు అంతే అనుకోండి. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా హ్యాపీగా చూడొచ్చు. 

బ్రో ఫైన‌ల్ పంచ్ : ఓకే బ్రో