మోదీని ఓడించడం సులభమే!

మోదీని ఓడించడం సులభమే!
  • ఇండియాకూటమి విజయం తధ్యమే !
  • బీహార్ ఎన్.సి.పి. అధ్యక్షుడు
  • రాణా రణ్ వీర్ సింగ్!
  • (పట్నా నుండి డి.సోమసుందర్) 

పట్నా , ఆగస్ట్ 24 :రానున్న ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభమేనని , ఇండియా కూటమి విజయం తధ్యమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీహార్ రాష్ట్రశాఖ  అధ్యక్షుడు రాణా రణ్ వీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు! ఆయన గురువారం తన కార్యాలయంలో సీనియర్ పాత్రికేయుడు డి.సోమసుందర్  తో మాట్లాడారు!  ధరల పెరుగుదల, నిరుద్యోగం , అవినీతి వంటి సమస్యలు  2024 లోక్ సభ ఎన్నికలకు ప్రధానఅంశాలుగా ఉంటాయని రణ్ వీర్ సింగ్ వివరించారు.  కొందరు నమ్ముతున్నట్లు మత విభజన రాజకీయాల ప్రభావం ఎంతమాత్రమూ  ఉండబోదని ఆయన తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలు బాగా అర్ధం చేసుకుంటున్నారని , పాలనా వైఫల్యాల నుండి , తమ అవినీతి కార్యకలాపాల నుండి దృష్టి మళ్ళించడానికి  నిరంతరం మత విభజన రాజకీయాలు తెస్తున్నారన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారని  ఆయన అన్నారు!.

అధిక ధరలకు , నిరుద్యోగానికి , అవినీతికి , కొనసాగుతున్న  రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఆగస్ట్ 9 నుండి బీహార్ లో తమ పార్టీ ప్రచార ఆందోళన చేపట్టిందని ఆయన  తెలిపారు! క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో తమపార్టీ "బిజెపి భారత్ చోడో"  నినాదంతో ప్రచారందోళన చేపట్టిందని ఆయన వివరించారు. "హిందూ - ముస్లిం , పాకిస్థాన్ , చైనా లాంటి మాటలు వినీ వినీ ప్రజలు వాటిలోని సారాంశాన్ని ఇప్పుడిప్పుడే  అర్థం చేసుకుంటున్నారని" ఆయన  అన్నారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు సమాన్యప్రజలకు భారంగా మారాయని అన్నారు. మున్నెన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగి పోవడంతో యువత ఆగ్రహంగా ఉందని అన్నారు. పూజలు , పురాణ పఠనాలు ఆకలి తీర్చలేవనే సంగతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రణ్ వీర్ సింగ్ అన్నారు. హిందూ మతం అంటే బిజెపి , బీజేపీ అంటే హిందూ మతం అనేటట్లుగా ఆ పార్టీ చేసే ప్రచారం బూటకమని , బీహార్ లో హిందూ మతాన్ని అనుసరించే ప్రజల్లో అత్యధికులు జేడీయూ , ఆర్జేడీ పార్టీలకు ఓటు వేస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించాలని  రణ్ వీర్ సింగ్ వివరించారు.

బీహార్ లో ఇండియా కూటమికి గట్టి పునాది ఉందని , నితీష్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ , వామపక్షాలు , ఎన్సీపీ , కలిసినందున అదొక  అత్యంత బలమైన శక్తిగా ఆవిర్భవిస్తున్నదని  రణ్ వీర్ సింగ్ వివరించారు. ఇండియా కూటమికి బీహార్ లో 64 శాతం ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఎన్.సి.పి.లో వచ్చిన అంతరంగిక విభజన పర్యవసానం గురించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తమపార్టీ నుండి కొందర్ని చీల్చడానికి చేసిన ప్రయత్నం ద్వారా బీజీపీ కూటమి బలహీనంగా ఉన్నట్లుగా తనకు తానే వెల్లడించుకున్నదని అన్నారు. ఒక నాయకుడు బైటికి వెళ్తే పార్టీకేడర్ , మొత్తం ఓటర్లు ఆయన వెంట వెళ్ళిపోతారనుకోవడం బొత్తిగా అమాయకత్వం అని ఆయన అన్నారు. మహారాష్ట్రలో శివసేన అంటే బాల్ ఠాక్రే , ఎన్సిపీ అంటే శరద్ పవార్ మాత్రమేనని , ఆ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని రణ్ వీర్ సింగ్ స్పష్టం చేశారు.

బాల్ ఠాక్రే వారసునిగా ఉద్ధావ్ ఠాక్రే నే శివసైనికులు గుర్తిస్తారని , అలాగే శరద్ పవార్ తోనే  మొత్తం ఎన్.సి.పి. కుటుంబం ఉందని ,  ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో బిజెపి కూటమికి పరాభవం కొత్తది కాదన్నారు. గతంలో ఎన్సీపీ తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనలోకి ఫిరాయింపు చేయించారని అయితే తర్వాతి ఎన్నికల్లో ఫిరాయింపు దారులు  45 మంది ఓటమి పాలయ్యారని , ఎన్సీపీ  58 సీట్లలో గెలిచిందని , బీజేపీ కి మహారాష్ట్రలో మరోసారి  పరాభవం తప్పదని రణ్ వీర్ సింగ్ స్పష్టం చేశారు. ఆగస్ట్ 31,సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయ్ లో జరగనున్న ఇండియా కూటమి సమావేశాల తర్వాత దేశ రాజకీయాలు మరింత స్పష్టత సంతరించు కుంటాయని ఆయన అన్నారు. మాయావతి వైఖరి గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈడి కేసులు ఉన్నందున ఆమె వేచి చూస్తున్నారని , కొద్ది నెలల్లో ఎవరు ఎవరితో ఉంటారో తేలిపోతుందని అన్నారు.  హిందీ బెల్ట్ లో మోదీ వ్యతిరేక కూటమి నానాటికీ బలోపేతం అవుతుందని రణ్ వీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.