వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..!

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..!
  • స్పూర్తినిచ్చిన రాహుల్​ భారత్​ జోడో యాత్ర
  • హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
  • మీడియాతో డోర్నకల్ కాంగ్రెస్ నాయకుడు నానావత్ భూపాల్ నాయక్

ముద్ర, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో రావడం ఖాయమని డోర్నకల్ కాంగ్రెస్ నాయకుడు నానావత్ భూపాల్ నాయక్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యా కుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర తో మోడీలో వణుకు పుట్టిందనీ యువనేతకు వస్తున్న ఆదరణ ఒర్వలేక బీజేపీ తప్పుడు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసిందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తొమ్మిదేళ్ల పాటు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​, బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,పెట్రోల్,గ్యాస్,డీజిల్ ధరల పెంపుతో మధ్య తరగతి కుటుంబాల బతుకు భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, నిరుద్యోగ రేటు తీవ్ర స్థాయిలో చేరాయన్న ఆయన హర్ ఘర్ జల్, ఆత్మనిర్భర్, భారత్ లాంటి మోడీ మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విభజన హామీల అమలులో బీజేపీ విఫలమైందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం ఊహించనంతగా పెరిగిందన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో తెలంగాణలో ఒక కేసీఆర్​ కుటుంబమే బాగుపడిందన్నారు. నీళ్లు,నిధులు, నియమాకాల నినాదంతో అధికారంలో వచ్చిన ఆ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల బీఆర్​ఎస్ పాలనలో మిగులు బడ్జెట్​ లో ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.

మెనిఫెస్టోలో దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిన ప్రభుత్వం కేవలం ఆర్భాటాలు, మాయమాటలతో పరిపాలన కొనసాగించిందన్నారు. కాంగ్రెస్​ తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్నిప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ముఖ్యంగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను  కాంగ్రెస్ నెరవేర్చిందనే విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలన్నారు. ఉద్యమ పార్టీగా ప్రజలు టిఆర్ఎస్ అధికారం కట్టబెడితే  ఆ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు నాలుగు ఐదు మాసాల సమయం మాత్రమే  ఉన్నందునా కార్యకర్తలందరూ ఇప్పడి నుండే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.