కుటుంబ పాలనను  అంతం చేద్దాం

కుటుంబ పాలనను  అంతం చేద్దాం
  • తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం
  • బీజేపీతోనే పేదల బతుకుల్లో మార్పు
  • మోడీ పాలనలో ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా దేశం
  • కేసీఆర్​కుటుంబం ప్రజలను దోచుకుంటోంది
  • నవ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలని, అందుకోసం వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దేశ ప్రజలకు మేలు చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్​కుటుంబం ప్రజలను దోచుకుంటూ.. దినదినాభివృద్ధి చెందుతోందని విమర్శించారు. ఆదివారం నాగర్​కర్నూల్​లో నిర్వహించిన నవ సంకల్ప బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. 

మోడీ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి..

మోడీ సమగ్రపాలనతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాలో జోగులాంబ శక్తిపీఠంతోపాటు కృష్ణా నది జిల్లాలు ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తూ రాజకీయ దుర్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదలు అభివృద్ధి చెందలేదని, కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారుమయంగా మారిందన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం వేల కోట్ల నిధులు మంజూరు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులతోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేశారని, వందే భారత్ రైలును ప్రారంభించారన్నారు.

ఎగుమతుల్లో మనదే మొదటి స్థానం..

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు మారుతాయని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ఆవాజ్ యోజన పథకంతో రాష్ట్రంలో పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులను మంజూరు చేశారని, వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రుణాలు, ఉజ్వల పథకం ద్వారా ఉచిత సిలిండర్లు, కిసాన్ సమన్ పథకం ద్వారా రైతులకు  రూ.2 వేలు వారి ఖాతాలో జమ చేశారని నడ్డా తెలిపారు. ప్రధాని అవలంబించిన ఆర్థిక విధానాలతో దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఎగుమతుల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆచారి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు ప్రసంగించారు. 

బీజేపీ నేతలతో నడ్డా సమావేశం..

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేతల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు జేపీ నడ్డా నేతలతో సమావేశం అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్​కు వచ్చిన నడ్డాను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్​, ఎమ్మెల్యే రఘునందన్​రావు, విజయశాంతి, వివేక్​స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో నడ్డా మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, బీఆర్ఎస్ తో సీరియస్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నోవాటెల్ హోటల్​బీజేపీ నేతలతో నడ్డా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన  పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడిందని, బీజేపీ ఢీలా పడిందనే ప్రచారం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి బయటకు రాకుండా చూసుకోవాలని సూచించారు. అగ్రనేతలంతా తమ మధ్య ఏదైనా సమస్య వస్తే తనతో మాట్లాడాలని కోరారు. శనివారం ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జరిగిన మీటింగ్​లో బండి సంజయ్ వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయని, వాటిని కూడా తగ్గించుకోవాలని బండికి నడ్డా తెలిపినట్లు సమాచారం.

ప్రొఫెసర్​నాగేశ్వర్​తో భేటీ..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రొఫెసర్ నాగేశ్వర్ తో భేటీ అయ్యారు. ఆదివారం టోలీచౌక్​లోని నాగేశ్వర్ ఇంటికి వెళ్లిన నడ్డా.. మోడీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందించారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నాగేశ్వర్​కు వివరించారు. అనంతరం ప్రొఫెసర్​ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని, వివిధ అంశాలపై సమావేశంలో చర్చించామని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక మందిని కలుస్తున్నారని, అందులో భాగంగానే తనను కలిశారన్నారు. నడ్డాతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు నాగేశ్వర్​తెలిపారు.