దేశవ్యాప్తంగా రుతుపవనాలు

దేశవ్యాప్తంగా రుతుపవనాలు
  • అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు
  • గురుగ్రామ్​లో కొట్టుకుపోయిన వెహికల్స్​
  • తెలుగు రాష్ర్టాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

ఢిల్లీ: ఈ ఏడాది కాస్త ఆలస్యమైనా నైరుతీ రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హర్యానా, చండీగఢ్, గూర్​గావ్​, యూపీ, మధ్యప్రదేశ్, జమ్మూ, దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణవ్యాప్తంగా శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఏకకాలంలో దేశమంతటా వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 60 ఏళ్ల క్రితం ఇలా జరిగిందని, చివరిసారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించాయని పేర్కొన్నారు. 24 గంటల్లో ముంబయి, ఢిల్లీతో సహా ఆయా రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. 

నాలాల్లోంచి ఇళ్లలోకి నీరు..

మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో నాలాల్లోంచి పొంగుతున్న నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న నాలాల వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా చిన్నపాటి వర్షాలకు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నాలాల పునరుద్ధరణ పనులు చేపట్టకుంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడంలో తీవ్ర జాప్యం నెలకొంది. గురుగ్రామ్​లో పడ్డ వర్షానికి పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి తప్పదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మూడు రోజుల్లో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురవబోతున్నాయన్నారు. 

రాష్ట్రంలో రెండ్రోజులు భారీ వానలు

ముద్ర, తెలంగాణబ్యూరో : రాష్ట్రంలో రెండ్రోజులపాటు అక్కడక్కడ మెరుపులతో  కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాది తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాయవ్య బంగాళఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలోని ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పాడిందని ఐఎండీ వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ పైకి వెళ్లేకొద్దీ నైరుతీ దిశమారుతుందని తెలిపింది