యూపీలో ముస్లిం విద్యార్దికి చెంపదెబ్బలు

యూపీలో ముస్లిం విద్యార్దికి చెంపదెబ్బలు
  • విచారణకు సుప్రీం ఆదేశం
  • ఘటనకు యూపీ ప్రభుత్వానిదే  భాధ్యత 

న్యూఢిల్లీ :యూపీలోని ముజఫర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ముస్లిం విద్యార్దిని తోటి విద్యార్ధులతో టీచర్ చెంపదెబ్బలు కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ విద్యార్ధిని స్కూల్లో అతని మతం ఆధారంగా చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటే అసలు విద్యాహక్కు చట్టం అమలవుతుందా అని యోగీ సర్కార్ ను ప్రశ్నించింది. ముజఫర్‌నగర్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలు తన సహవిద్యార్థిని చెప్పుతో కొట్టమని ఆదేశించిన ఘటన ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని, ఈ ఘటనకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయుని సూచనల మేరకు ఏడుస్తున్న ముస్లిం విద్యార్థిని వంతులవారీగా కొట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  గత నెలలో బయటపడిన ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో టీచర్ తోటి విద్యార్ధులతో ముస్లిం విద్యార్ధిని చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో ప్రభుత్వం టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసును విచారించే విషయంలో తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.  ఈ సంఘటనకు రాష్ట్రం బాధ్యత వహించాలని సూచించింది.