రూ. 2 వేల నోటు ఉపసంహరణ కేంద్రం వైఫల్యం - పి. చిదంబరం

న్యూఢిల్లీ: రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. ఇది మూర్ఖపు నిర్ణయమని మండిపడ్డారు. ఇందుకు ఆర్బీఐ కూడా సహేతుక కారణాలు వెల్లడించకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆర్బీఐ వేలం వెర్రి కారణాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రెండు వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టడమే తప్పని అంగీకరించేందుకు కూడా ఆర్బీఐ సిద్ధంగా లేదన్నారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ ముద్రించిన రెండు వేల రూపాయల నోటు 50 శాతం మేరకు ప్రజా వినియోగానికి రాలేదని, బ్యాంకుల దగ్గరే ఉండిపోయిందని చిదంబరం అన్నారు. నోట్ల జీవన ప్రమాణం నాలుగైదేళ్లే ఉంటుందని ఆర్బీఐ చెబుతోందని, అయితే రెండు వేల రూపాయల నోటు పెద్దగా చేతులు మారిన దాఖలాలు లేవని అన్నారు. రూ.100, రూ.50 నోట్లు నిత్యం వందలాది మంది చేతులు మారుతున్నాయని, మరి వాటిని ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని ప్రశ్నించారు. అమెరికాలో 100  డాలర్ల కరెన్సీ నోటు, బ్రిటన్‌లో 50 పౌండ్ల నోటు వందేళ్లుగా చెలామణిలో ఉన్నాయన్నారు. కరెన్సీ నోట్ల పరిచయం-, ఉపసంహరణ మన కరెన్సీ సమగ్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు.