పక్షులను స్వేచ్ఛగా తిరగనివ్వాలి పేటా ప్రతినిధులు

ముద్ర, ముషీరాబాద్: పక్షులను పంజరాల్లో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతినిధుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పంజరంలో పక్షులను బంధించవద్దని అవగాహన కల్పించేందుకు సంస్థ ప్రతినిధి ప్రియాంక మెహర్ పక్షులను స్వేచ్ఛగా తిరగనివ్వాలని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శిస్తూ పక్షి వేషధారణలో పంజరంలో కూర్చుని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు అధర్వదేశ్ ముఖ్, హిరాజ్ లాల్జని, రాధిక సూర్య వంశీ, ప్రియాంక మెహర్ మాట్లాడుతూ మూగజీవాలను పంజరాల్లో పెట్టి హింసించకుండా వాటిని స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకనివ్వాలన్నారు. దేశంలో వన్యప్రాణుల పరిరక్షణ చట్టాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్షులను పట్టుకోవడం వాటితో వ్యాపారాలు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. చట్టాలు అమలులో ఉన్నప్పటికీ అనేక రకాల పక్షులను పంజరాల్లో పెట్టి విక్రయిస్తున్నారని అన్నారు. ఈ పక్షులను పంజరాల్లో పెట్టి హింసించకుండా వాటిని స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వదిలేయాలని పేటా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.