గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్లాన్!

గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్లాన్!
  • చేరికలపై రేవంత్​రెడ్డి భారీ స్కెచ్​
  • బీఆర్ఎస్, బీజేపీ నేతలతో రహస్య మంతనాలు
  • జూలై 20న కొల్లాపూర్ లో ప్రియాంక సమక్షంలో భారీగా చేరికలు
  • అదే వేదికగా మహిళా డిక్లరేషన్, వడ్డీలేని రుణాలు, రిజర్వేషన్లపై ప్రకటన?
  • ప్రియాంకకు దక్షణాది రాష్ట్రాల బాధ్యతలు?
  • బీఆర్ఎస్​కు ఎమ్మెల్సీ కూచుపల్లి రాజీనామా

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ పావులు కదుపుతోంది. ఇప్పటికే కర్ణాటక గెలుపులో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలో ఒక్కొక్కటీగా అమలు చేస్తోన్న కాంగ్రెస్..​ముఖ్యంగా చేరికలపై దృష్టిసారించింది. ఈ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఓ ప్లాన్​ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చేరికలపై భారీ స్కెచ్​వేసిన రేవంత్​రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అసంతృప్తులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేరికతో మంచి బూస్టింగ్​లో ఉన్న ఆ పార్టీ.. కాంగ్రెస్​వైపు చూస్తోన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 20న నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్​లో జరిగే బహిరంగ సభకు హాజరువుతోన్న ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

కూచుపల్లి రాజీనామా..

నాగర్ కర్నూల్​డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్లొన్న కూచుకుల్ల ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 20న కొల్లాపూర్ సభలో ఆయన కాంగ్రెస్​కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మహబూబ్​నగర్​మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ, మహబూబాద్, ఆదిలాబాద్​మాజీ ఎంపీలు, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, రవీంద్రనాయక్, రాథోడ్​రమేశ్, గద్వాల జెడ్పీ చైర్​పర్సన్​సరిత, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్,​మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్​రెడ్డి, ఆదిలాబాద్​కు చెందిన రామారావ్​పటేల్, పాల్వాయి హరీశ్​రావు, కాజీపేట లింగయ్య, డోకూరి పవన్​కుమార్​రెడ్డి సైతం కాంగ్రెస్​లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక హాజరుకానున్న ఈ సభను.. ఖమ్మం రాహుల్​సభకు దీటుగా నిర్వహించేందుకు జూపల్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రియాంక కీలక ప్రకటనలు?

వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఆకర్శించేందుకు తహతహలాడుతోన్న కాంగ్రెస్​ఇప్పటికే రైతు, యూత్, భూ​డిక్లరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. కొల్లాపూర్​సభకు విచ్చేస్తోన్న ప్రియాంక గాంధీ ద్వారా మహిళా డిక్లరేషన్​ప్రకటనతో పాటు మహిళలకు వడ్డీలేని రుణాలు, పార్టీలో సీట్ల కేటాయింపుపైనా ప్రకటన చేయించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తోన్న కాంగ్రెస్​ఇప్పటికే మెదక్​నుంచి బరిలో ఉండాలని ప్రియాంకను కోరుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగే బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాలకు ప్రియాంకను ఆహ్వానించాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో కర్ణాటక ఫలితాలతో జోష్​లో ఉన్న హస్తం పార్టీ తాజాగా దక్షణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రియాంకను దక్షిణాది రాష్ట్రాల బాద్యతలు కూడా అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.