ఇండియాకు గట్టి పోటీ ఇస్తున్న ఆసీస్‌

ఇండియాకు గట్టి పోటీ ఇస్తున్న ఆసీస్‌

ఇందౌర్‌: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా మూడో టెస్టులో మాత్రం టీమ్‌ఇండియాకు గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. పీటర్‌ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్‌ గ్రీన్‌ ( 6) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్‌ ఖవాజా (60) అర్ధ శతకంతో మెరవగా.. లబుషేన్‌ (31), స్టీవ్ స్మిత్ (26), ట్రావిస్ హెడ్ (9) పరుగులు చేశారు. ఈ నాలుగు వికెట్లు జడేజా పడగొట్టినవే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి భారత్ 109 పరుగులకు ఆలౌటైంది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారని చెప్పాలి. రోహిత్‌, గిల్ క్రీజులో ఉన్నంతసేపూ వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ, ఆరో ఓవర్‌లో కునెమన్‌ రోహిత్‌ని ఔట్‌ చేసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఎనిమిదో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్ (21)ని కునెమన్‌ వెనక్కి పంపగా.. కాసేపటికే లైయన్‌ బౌలింగ్‌లో ఛెతేశ్వర్‌ పుజారా (1) పెవిలియన్‌ చేరాడు.

తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్‌ (0) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. జడ్డూని లైయన్‌ ఔట్‌ చేయగా.. కునెమన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకుంటాడనుకున్న విరాట్‌ కోహ్లీ (22; 52 బంతుల్లో 2 ఫోర్లు) భారీ స్కోరు చేయలేకపోయాడు. అతడు టాడ్‌ మార్ఫీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కేఎస్ భరత్ (17) లైయన్‌ వేసిన 25 ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 84/7తో రెండో సెషన్‌ను ప్రారంభించిన భారత్‌ మరో 25 పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. లైయన్ మూడు, మార్ఫీ ఒక వికెట్ తీశారు.