విండీస్ గడ్డపై   కోహ్లీ ఆట తీరుపై  అభిమానుల అంచనాలు

విండీస్ గడ్డపై   కోహ్లీ ఆట తీరుపై  అభిమానుల అంచనాలు
  • సెంచరీలు చేస్తాడా లేదా ? 

ముంబై :  టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలం పాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుమారు ఐదేళ్లుగా ఓవర్సీస్‌లో సెంచరీ బాదలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారీ శతకం బాదినా అది ఇండియాలోనే.  అందుకే చాలా మంది అతన్ని విమర్శిస్తున్నారు.  విదేశాల్లో సెంచరీ చేయడం లేదని తిడుతున్నారు.  కోహ్లీ చివరగా 2018 డిసెంబరులో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. ఇలాంటి సమయంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. ఈ సిరీసులో కచ్చితంగా కోహ్లీ సెంచరీ కొట్టేస్తాడని టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా అన్నాడు. తొలి టెస్టు గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించిన చోప్రా ఈ కామెంట్స్ చేశాడు. 

 'విరాట్ కోహ్లీ ఓవర్సీస్ సెంచరీ చేసి ఐదేళ్లు అవడం చాలా ఆశ్చర్యం.  అతను చివరగా 2018లో విదేశాల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీ చేయలేదు. అయితే ఆ ఎదురు చూపులకు ఈ సిరీస్‌లో శుభంకార్డు పడే ఛాన్స్ ఉంది' అని ఆకాష్ చోప్రా చెప్పాడు. అయితే విండీస్ గడ్డపై కోహ్లీ రికార్డు అంత గొప్పగా లేదని ఒప్పుకున్నాడు. టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీని విండీస్ గడ్డపైనే కోహ్లీ బాదాడు. కానీ ఆ తర్వాత పెద్దగా రాణించలేదు.  అన్ని టీమ్స్‌పైనా కోహ్లీ రికార్డు బాగానే ఉంది. కానీ వెస్టిండీస్, ఇంగ్లండ్ ఈ రెండు జట్లు, దేశాల్లో కోహ్లీ స్టాట్స్ అంత గొప్పగా లేవు. అతని స్థాయికి తగ్గ గణాంకాలు కావవి. మిగతా వారితో పోలిస్తే అవి చాలా మంచి లెక్కలే. కానీ కోహ్లీ స్థాయి కాదు. కాబట్టి ఈ సిరీసులో కూడా కోహ్లీపై బాగా ఫోకస్ ఉంటుంది' అని చోప్రా చెప్పాడు. కోహ్లీ కరీబియన్ దీవుల్లో ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడాడు.  ఈ గడ్డపైనే తన తొలి టెస్టు డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. 13 మ్యాచుల్లో కేవలం రెండుసార్లే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. విండీస్ గడ్డపై 13 మ్యాచుల్లో 35.61 సగటుతో 463 పరుగులు చేశాడు. మిగతా ఎవరైనా ఈ మాత్రం ఆడారంటే ఫర్వాలేదు. కానీ కోహ్లీ స్థాయికి ఇవి చాలా పేలవమైన గణాంకాలనే చెప్పాలి.