ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన భారత్ టాపార్డర్ 

ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన భారత్ టాపార్డర్ 

ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది. ఎట్టకేలకు సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో మూడో టెస్టుకు సిద్ధమై బరిలోకి దిగింది. అంతేకాదు..ఈ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్  బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా జట్టు ఊపుమీద కనిపిస్తోంది. మరోవైపు వరుసగా రెండు టెస్టులు పరాజయం పాలైన ఆస్ట్రేలియా  జట్టుకు ఈ మ్యాచ్ సవాల్‎గా మారింది. ఈ మ్యాచ్‎లో పుంజుకుని ఎట్టిపరిస్థితుల్లో మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలని చూస్తోంది. ఇక..బుధవారం మూడో టెస్టులో టీమిండియా జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్  బ్యాటింగ్ తీసుకున్నాడు.  టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాపార్డర్.. దెబ్బకు కుప్పకూలింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే.. ఇన్నింగ్స్‎ను ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. రోహిత్, గిల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వరుసగా ఫోర్లు బాదారు. దీంతో టిమిండియా 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 26 పరుగులకు చేసింది. రోహిత్ (12), గిల్ (14) మంచి దూకుడు మీద ఉన్నారు. ఇదే క్రమంలో రోహిత్ (12) వద్ద కునెమన్ వేసిన ఓవర్‎లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 27 పరుగుల వద్ద తొలి వికెట్‎ను భారత్ కోల్పోయింది.  

ఇక దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించిన శుభమన్ గిల్ కూడా (21) కునెమన్ బౌలింగ్‎లోనే అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా లైయన్ బౌలింగ్‎లో ఒక్క పరుగుకే బౌల్డ్ అయి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ జడేజా (4) కునెమన్‎కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన కింగ్ కోహ్లీ కూడా (22) రన్స్ చేసి ఔటయ్యాడు. మరోవైపు కీపర్ భరత్ (17) రన్స్ చేసి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 25 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్, అశ్విన్ కొనసాగుతున్నారు.