అంధుల క్రికెట్​వరల్డ్​కప్​ భారత్​కైవసం

అంధుల క్రికెట్​వరల్డ్​కప్​ భారత్​కైవసం
  • పలువురి ప్రశంసలు

ముంబై: అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత అమ్మాయిల క్రికెట్ జట్టుపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు చెలరేగారు. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్ 2023లో అద్భుతంగా రాణించిన ఈ టీం.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి గోల్డ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డీఎల్ఎస్ విధానంలో భారత అమ్మాయిలు నెగ్గారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత జట్టు అద్భుతంగా కట్టడి చేసింది. దీంతో ఏమాత్రం కోలుకోలేకపోయిన ఆసీస్ అమ్మాయిలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఈజీగా ఛేజ్ చేసేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆలస్యమైంది. చివరకు భారత్ ముందు 42 పరుగుల టార్గెట్ నిలిపారు. దీన్ని భారత అమ్మాయిలు కేవలం 3.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించారు. దీంతో ఐబీఎస్‌ఏ వరల్డ్ గేమ్స్‌లో జరిగిన తొలి క్రికెట్ ట్రోఫీ నెగ్గిన మొట్ట మొదటి జట్టుగా భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా భారత అమ్మాయిలపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. 'ఐబీఎస్ఏ వరల్డ్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళల జట్టుకు శుభాభినందనలు. మన క్రీడాకారిణుల సత్తా, పట్టుదలను నిరూపించే ఘట్టం ఇది. ఈ విజయం చూసిన భారత్ గర్విస్తోంది' అని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో మెచ్చుకున్నారు. ఇతర ప్రముఖులు కూడా భారత అమ్మాయిలపై ప్రశంసలు కురిపించారు.