అహ్మదాబాద్‌ టెస్టులో వారిద్దరినీ ఆడించాలి: రికీ పాంటింగ్‌

అహ్మదాబాద్‌ టెస్టులో వారిద్దరినీ ఆడించాలి: రికీ పాంటింగ్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో  భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే టీమ్‌ఇండియాకు ఇది చాలా కీలకం. అయితే, జట్టు కూర్పుపై మాత్రం భారత మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తొలి రెండుటెస్టుల్లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను తప్పించి యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించింది. కానీ, మూడో టెస్టులో గిల్‌ నిరాశపరిచాడు. ఈ క్రమంలో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలి...? లేకపోతే మిడిల్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్‌ లేకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి. అయితే, నాలుగో టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో వీరిద్దరినీ తీసుకోవాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ చెప్పాడు.  ''మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ వచ్చాడు. కానీ, గిల్‌ ఆకట్టుకోలేకపోయాడు. అయితే, నాలుగో టెస్టులో ఇద్దరినీ ఆడించేందుకు అవకాశం ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనింగ్‌కు పంపి.. కేఎల్‌ను మిడిలార్డర్‌లో ఆడించొచ్చు. ఇంతకుముందు కూడా రాహుల్‌ ఇదే స్థానంలో టెస్టు క్రికెట్‌ ఆడాడు. డ్లబ్ల్యుటీసీ  ఫైనల్​  జరిగే యూకేలోని పిచ్‌ పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతూనే ఉంటుంది. భారత్‌, ఆసీస్‌ జట్లు అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాయని అనుకుంటున్నా. ఇది కేవలం టెస్టు మ్యాచ్‌ మాత్రమే కాదు.. ఇరు జట్లకూ చాలా కీలకం''అని పాంటింగ్‌ తెలిపాడు.